Asianet News TeluguAsianet News Telugu

అలా అయితే వన్డే వరల్డ్ కప్‌ కోసం మేం కూడా ఇండియాకు రాం.. మాకూ తటస్థ వేదికలు కావాలి: పాక్ మాజీ సీఈవో

Asia Cup 2023 Row: ఆసియా కప్ వివాదం  సద్ధుమణిగినట్టే కనిపిస్తున్న వేళ   పాకిస్తాన్  క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ సీఈవో  వసీం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Pakistan wont play their matches in India during the World Cup, Claims  PCB EX CEO Wasim Khan MSV
Author
First Published Mar 29, 2023, 6:12 PM IST

ఈ ఏడాది ఆసియా కప్ వివాదం  కొద్దిరోజుల క్రితమే సద్దుమణిగిందని అనుకుంటున్న  ప్రతీసారి ఇది రావణకాష్టంలా  రగులుతూనే ఉంది.   భద్రతా కారణాల నేపథ్యంలో తాము పాకిస్తాన్ కు రాబోమని, తటస్థ వేదికలపై అయితేనే  ఆసియా కప్ ఆడతామని  భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.  ఆసియా క్రికెట్ కౌన్సిల్  (ఏసీసీ) ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చినా   పాకిస్తాన్  క్రికెట్ లో మాత్రం  ఈ వివాదం మసులుతూనే ఉంది. తాజాగా    పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ సీఈవో, ప్రస్తుతం  అంతర్జాతీయ క్రికట్ మండలి (ఐసీసీ)  మేనేజర్ ఆఫ్ క్రికెట్  వసీం ఖాన్.. సంచలన వ్యాఖ్యలతో మళ్లీ తేనెతుట్టెను కదిపాడు. 

ఆసియా కప్ నిర్వహణ వివాదం గురించి చర్చ  జరుగుతున్న వేళ పాకిస్తాన్ లోని స్థానికంగా ఉన్న ఓ టీవీ చానెల్ తో వసీం ఖాన్ మాట్లాడుతూ.. ఆసియా కప్ ఆడేందుకు  భారత్ పాక్ కు రాకుండా తటస్థ వేదికలపైనే ఆడతామని చెబుతుంటే తాము మాత్రం వన్డే వరల్డ్ కప్ కోసం ఇండియాకు వెళ్లేది లేదని, తాము ఆడే మ్యాచ్ లకూ న్యూట్రల్ వెన్యూస్ కావాలని డిమాండ్ చేస్తున్నాడు. 

ఇదే విషయమై  వసీం ఖాన్ మాట్లాడుతూ.. ‘ఆసియా కప్ లో ఆడేందుకు భారత్ తటస్థ వేదిక కోరుకుంటున్నది.   రాబోయే వన్డే వరల్డ్ కప్ లో కూడా  పాకిస్తాన్.. భారత్ లో మ్యాచ్ లు ఆడుతుందని నేనైతే అనుకోవడం లేదు.  భారత్ ఆసియా కప్ మ్యాచ్ లకు తటస్థ వేదికలను కోరుకుంటున్నట్టే  ప్రపంచకప్ లో పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు కూడా న్యూట్రల్ వెన్యూస్ లోనే జరుగుతాయని  నేను భావిస్తున్నా..’అని  అన్నాడు.   

 

వసీం ఖాన్ వ్యాఖ్యలకు తోడు  ఆసియా కప్  నిర్వహణ వివాదంపై  గత కొద్దిరోజులుగా  పాకిస్తాన్ ఆటగాళ్లు అవాకులు చెవాకులు పేలుతున్న విషయం తెలిసిందే.   పాకిస్తాన్ మాజీ ఓపెనర్ ఇమ్రాన్ నజీర్ కూడా  కొద్దిరోజుల క్రితం మాట్లాడుతూ..  భద్రతా కారణమని భారత్ చెబుతున్నా అది ఒట్టి సాకు మాత్రమేనని,  అసలు విషయం ఆ జట్టు ఇక్కడికి వస్తే ఓడిపోతుందనే భయమేనని  వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.  

ఇదిలాఉండగా.. ఈ వివాదం  మొదలైన కొత్తలో  పీసీబీ కూడా  ‘ఆసియా కప్ ఆడేందుకు భారత్ పాక్ కు రాకుంటే మేం కూడా వన్డే వరల్డ్ కప్ కోసం  ఇండియాకు రాబోము’అని హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్  స్పందిస్తూ..  పాకిస్తాన్ రాకున్నా వన్డే వరల్డ్ కప్ కు ఏ లోటూ ఉండదని, భారత్ కు వచ్చిన దేశాలతోనే  ఈ టోర్నీని ఘనంగా నిర్వహిస్తామని   వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.   
 

Follow Us:
Download App:
  • android
  • ios