పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఇటీవల విడుదలచేసిన అతడి ఆటోబయోగ్రఫి ''గేమ్ చేంజర్'' పుస్తకం  వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.  తన నోటి దురుసుతో ఇప్పటివరకు సృష్టించిన అలజడి  చాలదన్నట్లు తన ఆత్మకథలోనూ కాంట్రవర్సీ విషయాలను ప్రస్తావించాడు. యావత్ ప్రపంచం మహిళా సాధికారత గురించి చర్చిస్తుంటే అఫ్రిది మాత్రం మహిళా  స్వేచ్చను హరించే  ఓ ప్రకటన చేశాడు. తన కూతుళ్లు క్రికెట్ పై ఆసక్తి చూపించినా వారికి ఆ ఆటకు  దూరంగా వుంచుతానంటూ అఫ్రిది తన ఆత్మకథలో పేర్కొన్నాడు. 

ఇస్లాం మతం అవుట్ డోర్ ఆటలు ఆడేందుకు ఒప్పుకోదు కాబట్టి తన కూతుళ్లను క్రికెట్ కు దూరంగా వుంచుతానని వెల్లడించాడు. అయితే వారు నిరభ్యంతరంగా ఇండోర్ గేమ్  ఆడుకునే స్వేచ్చను ఇస్తానని తెలిపాడు. తన మతాచారాలను కించపరిచేలా  ఎప్పుడూ వ్యవహరించనని...పిల్లలనూ అలాగే పెంచుతానని అఫ్రిది స్పష్టం చేశాడు. 

పెద్దకూతురు అక్సా  10వ తరగతి, అన్షా 9వ తరగతి చదువుతున్నారని...మిగతా  ఇద్దరు అజ్మా, అస్మాలు ఇంకా చిన్నపిల్లలంటూ తన ముద్దుల కూతుళ్లను అఫ్రిది పరిచయం చేశాడు. ఈ సందర్భంగా వారి  ఇష్టాఇష్టాల గురించి పేర్కొంటూ... వారిని తన ప్రొపెషన్ లోకి రానివ్వనని తెలిపాడు. ఇలా  తన కూతుళ్ల వ్యక్తిగత స్వేచ్చను హరిస్తున్నానని స్త్రీవాదులు  అనుకున్నా తనకేమీ  అభ్యంతరం లేదన్నాడు. తాను ఓ తండ్రిగానే కాకుండా మతాచారాలను, మత  పెద్దలను  గౌరవించే వ్యక్తిగా ఆలోచిస్తున్నానని...దాన్ని అందరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు అఫ్రిది వివరణ ఇచ్చాడు. 

ఇదే ఆత్మకథ పుస్తకం గతకొన్ని రోజులుగా మరో వివాదాన్న కూడా రాజేస్తున్న విషయం తెలిసిందే. టీమిండియా మాజీ ప్లేయర్, ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్ధి  గౌతమ్ గంభీర్ ను ఓ పొగరుబోతు ఆటగాడంటూ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అఫ్రిదికి  గంభీర్ కు మధ్య మాటల యుద్దం  కొనసాగుతోంది. ఈ వివాదం సద్దుమణగక ముందే ఆ పుస్తకంలోని  మరో కాంట్రవర్సీ అంశం బయటకు వచ్చింది.