Asianet News TeluguAsianet News Telugu

క్వెట్టాలో బాంబు పేలుడు.. మ్యాచ్‌ను ఆపేసి ఆటగాళ్లను తరలించిన పాక్.. ఆసియా కప్ చర్చల నేపథ్యంలో భారీ షాక్..

Quetta Blast: ఆసియా కప్  - 2023 ను తమ దేశంలోనే పట్టుబడుతున్న పాకిస్తాన్ క్రికెట్ కు మరో ఎదురుదెబ్బ.  పాకిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్ ఆడుతున్న  ఓ స్టేడియానికి సమీపంలోనే బాంబు పేలుడు సంభవించింది.  

Pakistan Super League Exhibition Match Stopped After Quetta Blasts MSV
Author
First Published Feb 5, 2023, 7:03 PM IST

ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్తాన్.. ఈ టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలని గొంతు చించుకుంటున్న విషయం తెలిసిందే.  ‘మీ దేశంలో భద్రతా సమస్యలున్నాయి’ అని భారత్ తో పాటు  మిగతా దేశాలు మొత్తుకుంటున్నా  వినకుండా  మొండిపట్టు పట్టిన పాకిస్తాన్  కు మరో భారీ ఎదురుదెబ్బ తాకింది.  తమ దేశపు క్రికెటర్లు ఆడుతున్న ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతున్న స్టేడియానికి సమీపంలోనే తీవ్రవాదులు రెచ్చిపోయారు.  పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)  సన్నాహకాల్లో భాగంగా ఆ జట్టు  క్రికెటర్లు క్వెట్టాలో ఆడుతున్న  స్టేడియానికి సమీపంలోనే భారీ పేలుడు సంభవించింది. 

క్వెట్టాలోని  బుగ్టి స్టేడియంలో  క్వెట్టా గ్లాడియేటర్స్ వర్సెస్  పెషావర్ జల్మీల మధ్య  ఆదివారం ఎగ్జిబిషన్ మ్యాచ్ జరగాల్సి ఉంది.  ఈ మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే   స్టేడియం సమీపంలోని ఎఫ్‌సీ  ముస్సా చెక్ పాయిం్ సమీపంలో ఈ బ్లాస్ట్ జరిగింది.  రోడ్డు పక్కన జరిగిన ఈ బాంబ్ బ్లాస్ట్ లో సుమారు ఐదుగురు గాయపడ్డారని పాకిస్తాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.  

కాగా ఈ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాకపోయినా.. క్వెట్టాలోని బుగ్టీ స్టేడియంలో  ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగా    స్టేడియం మీద దట్టమైన  పొగ ఆవహించి ఉండటంతో   మ్యాచ్ చూడటానికి వచ్చిన  ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు కూడా  మ్యాచ్ ను ఆపేసి ఆటగాళ్లను  సురక్షిత ప్రాంతాలకు తరలించారు.   ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. 

 

పేలుళ్లకు మ్యాచ్ నిలుపుదలకు సంబంధం లేదా..? 

క్వెట్టాలో పేలుళ్లకు, బుగ్టీ స్టేడియంలో  మ్యాచ్ నిలిపివేయడానికి సంబంధం లేదని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ నిలిపేయడానికి కారణం క్వెట్టా పేలుళ్లు కాదని.. స్టేడియం బయట  పలువురు  చేసిన ఆందోళనే కారణమని అంటున్నారు. ఈ మ్యాచ్ ను చూడటానికి   బుగ్టీ స్టేడియానికి భారీగా అభిమానులు తరలివచ్చారు.  వారిలో చాలా మందికి లోపలికి వెళ్లడానికి అనుమతి లభించలేదు.  దీంతో వాళ్లు   గ్రౌండ్ బయట ఆందోళనకు దిగారు.   బండరాళ్లను స్టేడియం మీదకు విసిరారు. వాస్తవానికి బుగ్టీ స్టేడియం ఎత్తు తక్కువగా ఉంటుంది.  దీంతో ఆ బండరాళ్లు కాస్తా  మ్యాచ్ చూస్తున్న  ప్రేక్షకుల మీద పడటంతో   స్టేడియంలో అలజడి మొదలైంది.   మ్యాచ్ చూస్తున్న అభిమానులు కూడా  కుర్చీలు  విసిరేస్తూ హంగామా చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్తిథులు ఏర్పడటంతో  మ్యాచ్ ను నిలిపేసినట్టు పలువురు  నెటిజన్లు  చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. 

 

ఏదేమైనా  మ్యాచ్ జరుగుతున్న  స్టేడియానికి సమీపంలోనే  బాంబులు పేలడం..  మ్యాచ్ ను ఉన్నఫళంగా నిలుపుదల చేయడం వంటివన్నీ పాకిస్తాన్ జాతీయ క్రికెట్ కు ఎదురుదెబ్బలే. ఇప్పటికే పాకిస్తాన్ కు రావాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్న అంతర్జాతీయ జట్లు.. ఈ దాడితో మరింత  ఆలోచనలో పడతాయి.  దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఏం సమాధానం చెబుతుందో మరి....!

Follow Us:
Download App:
  • android
  • ios