ఐసిసి ప్రపంచ కప్ ట్రోఫీయే లక్ష్యంగా ఇటీవల ఇంగ్లాండ్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే చతికిలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీలో ఓటమికి పాక్ సెలెక్టర్ల పక్షపాత నిర్ణయాలు, ఆటగాళ్లలో సమిష్టితత్వం లోపించడం, జట్టులో ఆధిపత్యపోరు ఇలా చాలా అంశాలు కారణమయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరింత దిగజారకుండా చూసేందుకు ఏకంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రంగంలోకి దిగారు. అతి త్వరలో పాక్ క్రికెట్ బాధ్యతలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. 

ప్రస్తుతం అమెరికా పర్యటనలో వున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ క్రికెట్ జట్టు గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ టీం ప్రదర్శనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు కేవలం దేశ సమస్యలపైనే దృష్టి పెట్టానని...ఇకనుండి క్రికెట్ వ్యవహారాలపై కూడా ప్రత్యేక దృష్టి పెడతానని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించాడు. 

పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా తన చర్యలుంటాయని... అంతర్జాతీయ జట్లన్నిటిలో మేటి  జట్టుగా తయారు చేయడమే లక్ష్యమని అన్నారు. అందుకోసం ఎలాంటి వ్యూహాలను  అనుసరించాలన్న దానిపై పిసిబి సలహాలు, సూచనలు తీసుకుంటా. ప్రతి పాకిస్థానీ ఇది మా క్రికెట్ జట్టు అని గర్వంగా అని చెప్పుకునేలా తీర్చిదిత్తుతానని ఇమ్రాన్ స్పష్టం చేశాడు. 

''నేను ఉట్టిమాటలు చెబుతున్నట్లు ఎవరికైనా అనిపిస్తే వీటిని వచ్చే ప్రపంచ కప్ వరకు గుర్తుంచుకొండి. అప్పటివరకు మన జట్టు ఎలా తయారవుతుందో చూడండి. ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు ఎంపిక, పిసిబి, సెలెక్షన్ కమిటీ వ్యవహారం ఎలా వుంటుందో చూడండి.'' అంటూ ఇమ్రాన్ పాక్ క్రికెట్ విషయంలో తాను ఎంత దృడసంకల్పంతో వున్నాడో బయటపెట్టాడు. 

పైరవీలు, పక్షపాతంతో పాక్ ఆటగాళ్ల ఎంపిక ఇకనుండి వుండదని అన్నారు. ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగానే వారికి అవకాశాలుంటాయని... అందుకోసం క్షేత్ర స్థాయి నుండి చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా పాకిస్థాన్ క్రికెట్ ను సెట్ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.