Asianet News TeluguAsianet News Telugu

Hassan Ali: ఇదేం స్పీడ్ రా నాయనా.. అక్తర్ రికార్డును బద్దలుకొట్టిన ‘పాకిస్థాన్ విలన్’

Bangladesh Vs Pakistan: ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక  వేగవంతమైన బాల్ విసిరిన షోయభ్ అక్తర్ రికార్డును అదే దేశానికి చెందిన మరో స్పీడ్ బౌలర్ చెరిపేశాడు. అయితే  ఇందులో ఓ తిరకాసు ఉంది.. అదేంటంటే..? 

Pakistan Pacer Hassan ali delivery clocked at 219 kph in First T20I against Bangladesh, Twitter Responds Hilariously
Author
Hyderabad, First Published Nov 20, 2021, 11:48 AM IST

ప్రపంచ క్రికెట్ లో ఎంతమంది బౌలర్లు వచ్చినా రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ స్పీడే వేరు. అక్తర్ ఆడక ముందు.. రిటైరైన తర్వాత చాలా మంది  పేసర్లు బౌలింగ్ వేసినా అతడి వేగాన్ని అందుకోలేకపోయారు. క్రికెట్లో అత్యధిక వేగంతో బంతులు విసిరిన  రికార్డు అతడి పేరిటే ఉంది. 2003లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్ తో జరిగిన ఓ  మ్యాచ్ లో అక్తర్.. 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇప్పటివరకు ఇదే రికార్డు. ప్రపంచంలో చాలా మంది బౌలర్లు వచ్చినా ఈ రికార్డు చెక్కు చెదరలేదు. అయితే మరో పాకిస్థాన్ బౌలర్, ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో  సెమీస్ పాక్ ఓటమికి ఒకడిగా ఆ దేశాభిమానులు ముద్ర  వేసిన హసన్ అలీ ఈ రికార్డును బ్రేక్ చేశాడు..? అదేంటి.. రికార్డును బ్రేక్ చేశాడని ప్రశ్నార్థకం గుర్తు పెట్టారని అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలు కిటుకు.

ప్రపంచకప్ ముగిసిన తర్వాత పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ బంగ్లాతో టీ20 లతో పాటు టెస్టు సిరీస్ కూడా ఆడనున్నది. ఇందులో భాగంగానే శుక్రవారం తొలి టీ20 జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. తక్కువ స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ ఇన్నింగ్స్ లో రెండో ఓవర్ బౌలింగ్ చేసిన హసన్ అలీ.. రెండో బంతిని స్పీడ్ గన్.. 219.0 కిలోమీటర్ల వేగంగా చూపెట్టింది. దీంతో అందరూ ఆశ్చర్యపోయారు.  హసన్ అలీ.. అక్తర్ రికార్డును బద్దలు కొట్టారని  ట్విట్టర్ లో పోస్టులు వెల్లువెత్తాయి. పలువురు అలీ మద్దతుదారులైతే సంబురాలు కూడా చేసుకున్నారు. కానీ...!

 

ఈ మ్యాచ్ లో  స్పీడ్ గన్ సరిగా పని చేయలేదు. అది తప్పు చూపెట్టింది. గంటకు 130 కిలోమీటర్ల వేగం కూడా మించకుండా బౌలింగ్ చేసే అలీ.. ఇంత స్పీడ్ గా బంతి వేశాడా..? అని ముక్కున వేలేసుకున్న  జనాలకు అసలు విషయం తెలిసి  అవాక్కయ్యారు. ఇక దీనిపై ట్విట్టర్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాలలో మీమ్స్, ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. 

 

కాగా.. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ కష్టపడి గెలిచింది.  మొదట బ్యాటింగ్ చేసిన  బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. అఫిఫ్ హుస్సేన్, మెహది హసన్, నురుల్ హసన్ లు రాణించడంతో బంగ్లా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  ఒక్క క్యాచ్ వదిలేసి కెరీర్ అంతా బాధపడే విధంగా నవ్వులపాలైన హసన్ అలీ.. ఈ మ్యాచ్ లో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్ తడబడింది. ఛేజింగ్ లో 24 పరుగలకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆ జట్టును.. ఫకర్ జమాన్, ఖుష్దిల్ షాలు ఆదుకున్నారు. 19.2 ఓవర్లలో పాక్ విజయం ఖాయమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios