వైస్ కెప్టెన్ను చేశారు.. తుది జట్టు నుంచి తప్పించారు.. ఇదేం విచిత్రంరా బాబు...
PAKvsNZ ODI: పాకిస్తాన్ ఆట నిలకడలేమికి మారు పేరు అని క్రికెట్ గురించి తెలిసినవారందరికీ తెలుసు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జట్టుకే తెలియదు. ఆన్ ది ఫీల్డ్ లో కాదు ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా ఆ జట్టు నిర్ణయాలు అలాగే ఉంటాయి..

గెలుస్తున్నామనకునే మ్యాచ్ లో ఓడటం.. ఉన్నఫళంగా వికెట్లను కోల్పోయి మ్యాచ్‌లను వదులుకోవడం.. అసలు ఆశలే లేని స్థితి నుంచి భారీ విజయాలను అందుకోవడం పాకిస్తాన్ జట్టుకు అలవాటు. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో ఆ జట్టును నిలకడ లేమికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారు క్రికెట్ ఫ్యాన్స్. ఆన్ ది ఫీల్డ్ లోనే కాదు ఆఫ్ ది ఫీల్డ్ లో కూడా ఆ జట్టు నిర్ణయాలు ఇలాగే ఉన్నాయి. జట్టుకు వైస్ కెప్టెన్ ను చేసిన క్రికెటర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టడం పాకిస్తాన్ కే చెల్లింది.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో భాగంగా నేడు కరాచీ వేదికగా పాకిస్తాన్ తొలి మ్యాచ్ ఆడుతున్నది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాన్ మసూద్ ను జట్టుకు వైస్ కెప్టెన్ గా నియమించింది. వాస్తవానికి బాబర్ ఆజమ్ డిప్యూటీగా గత మూడేండ్లుగా షాదాబ్ ఖాన్ ఉండేవాడు. కానీ వేలి గాయం కారణంగా అతడి స్థానాన్ని మసూద్ భర్తీ చేస్తున్నాడు.
సుమారు మూడేండ్ల తర్వాత మసూద్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2019లో ఆసీస్ తో ఐదు వన్డేల సిరీస్ తర్వాత మసూద్ వన్డేలు ఆడలేదు. ఇటీవల కాలంలో అతడు టీ20లలో నిలకడగా రాణిస్తుండటంతో వన్డే జట్టుకు పిలుపొచ్చింది. అంతేగాక పీసీబీ అతడిని బాబర్ ఆజమ్ కు డిప్యూటీగా కూడా చేసింది. అయితే అతడు న్యూజిలాండ్ తో తొలి వన్డేలో మాత్రం బెంచ్ మీదే కూర్చోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
మసూద్ ను వైస్ కెప్టెన్ చేయడం బాబర్ కు ఇష్టం లేదని.. భవిష్యత్ లో అతడు తన స్థానానికి ఎసరు పెట్టే అవకాశమున్నదని పాకిస్తాన్ సారథి భయపడుతున్నాడని, అందుకే ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడని పాకిస్తాన్ క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో బాబర్ చెప్పిన మాటలు కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తున్నాయి. బాబర్ మాట్లాడుతూ..‘నేను ఇక్కగ ఏ ఒక్క ఆటగాడి గురించి మాట్లాడదలుచుకోలేదు. అతడు వైస్ కెప్టెన్ అయినా ఇంకెవరైనా సరే. నాకు అనవసరం. ఈ సిరీస్ లో మా బెస్ట్ లెవన్ ను బరిలోకి దించుతాం..’అని చెప్పాడు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు వన్డేలో అతడిని వైస్ కెప్టెన్ అని కూడా చూడకుండా పక్కనబెట్టడం గమనార్హం.
ఇక తొలి వన్డేలో న్యూజిలాండ్ తడబడుతున్నది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కివీస్ ను కట్టడి చేస్తున్నారు. 42 ఓవర్లు ముగిసేసరికి కివీస్.. 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కివీస్ లో ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌట్ అవ్వగా ఫిన్ అలెన్ (29) తో పాటు కేన్ విలియమ్సన్ (26) విఫలమయ్యారు. డారిల్ మిచెల్ (36), టామ్ లాథమ్ (42) కుదురుకున్నట్టే కనిపించినా వాళ్లు ఎక్కువసేపు నిలువలేదు. ప్రస్తుతం గ్లెన్ ఫిలిప్స్ (34 బ్యాటింగ్), మైఖేల్ బ్రాస్వెల్్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.