పాక్ క్రికెట్‌లో లుకలుకలు ఇప్పుడు కొత్తేమీ కాదు. మొన్నటికి మొన్న డానిష్ కనేరియా పాక్ క్రికెట్‌ బోర్డుపై ఆరోపణలు చేయగా, నిన్న బౌలర్ మహ్మద్ అమీర్ పీసీబీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి మాజీ క్రికెటర్ మహ్మద్ ఆసిఫ్ కూడా వచ్చేశాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో క్రికెటర్లకి పెద్దగా అనుభవం లేదు. అయితే ఇదంతా రికార్డుల్లోనే అంటున్నాడు ఆసిఫ్. 

‘పాక్ ప్లేయర్లు చాలా తెలివైనవాళ్లు. జట్టులో చోటు కోసం వయసు పదేళ్లు తగ్గించి చూపిస్తారు. బర్త్ సర్టిఫికెట్ల ప్రకారం పాక్ పేసర్ల వయసు 17, 18 ఏళ్లే ఉంటుంది. కానీ నిజానికి వారి వయసు పదేళ్లు ఎక్కువగానే ఉంటుంది... వయసు పైబడిన తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లు సుదీర్ఘమైన బౌలింగ్ స్పెల్స్ వేయలేరు... 

20 నుంచి 25 ఏళ్లు బౌలింగ్ చేసే సత్తా వారికి ఉండదు... సరిగ్గా ఐదు ఓవర్లు వేస్తే, తర్వాత మైదానంలో కుదురుగ్గా ఫీల్డింగ్ కూడా చేయలేరు... ఒళ్లు వంగదు... కొద్దిసేపు బౌలింగ్ చేయగానే కండరాలు పట్టిస్తున్నాయని తప్పుకుంటున్నారు...’ అంటూ కామెంట్ చేశాడు ఆసిఫ్. 

పాక్ పేసర్లు పది వికెట్లు తీసి చాలాకాలమైందని చెప్పిన ఆసిఫ్, న్యూజిలాండ్ పిచ్‌లపై కూడా వికెట్లు తీయడానికి మా వాళ్లు తెగ ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్యానించాడు. మహ్మద్ ఆసిఫ్ 2010లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐదేళ్లు నిషేధానికి గురయ్యాడు.