రోజూ మతం మారాలని హింసించేవారు! పాక్ టీమ్‌పై డానిష్ కనేరియా షాకింగ్ కామెంట్స్...
మతం మారాల్సిందిగా డానిష్ కనేరియాని తీవ్రంగా ఒత్తిడి చేసిన పాకిస్తాన్ క్రికెటర్లు.. సోషల్ మీడియా ద్వారా షాకింగ్ విషయాలు బయటపెట్టిన మాజీ పాక్ క్రికెటర్..
పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌కి ఆడిన హిందు మతస్థుడు డానిష్ కనేరియా. 2000 నుంచి 2010 వరకూ పాకిస్తాన్ టీమ్ తరుపున 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన డానిష్ కనేరియా 276 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ టీమ్‌కి ఆడిన మొట్టమొదటి హిందు మతస్థుడు అనిల్ దల్‌పత్ మేనల్లుడైన డానిష్ కనేరియా.. పాక్ టీమ్‌లో ఉన్నప్పుడు ఎదుర్కొన్న వివక్షలపై సంచలన ఆరోపణలు చేశాడు.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహ్‌జాద్, శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్‌తో మత మార్పిడి గురించి చెబుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు డానిష్ కనేరియా..
‘నువ్వు ముస్లింవి కాకపోతే, ముస్లింగా మారిపో. నీ జీవితం ఎలా ఉన్నా పర్లేదు, నేరుగా స్వర్గానికి వెళ్తావ్...’ అని దిల్షాన్‌తో అన్నాడు అహ్మద్ షెహ్‌జాద్. దానికి దిల్షాన్ ఇచ్చిన రిప్లై, వీడియోలో సరిగ్గా వినిపించలేదు.. ‘అయితే మంటను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు..’ అంటూ షెహ్‌జాద్ సమాధానం ఇవ్వడం మాత్రం వినిపించింది.
ఈ వీడియో షేర్ చేసి ‘డ్రెస్సింగ్ రూమ్‌లో, ప్లే గ్రౌండ్‌లో లేదా డైనింగ్ టేబుల్ దగ్గర నేను ఇలాంటివి వివక్షను ప్రతిరోజూ ఎదుర్కొన్నాను..’ అంటూ కాప్షన్‌తో ట్వీట్ చేశాడు డానిష్ కనేరియా.. కనేరియాని మతం మారాల్సిందిగా రోజూ పాక్ టీమ్ నుంచి ఒత్తిళ్లు వచ్చినట్టు తెలుస్తోంది..
ఇక్కడ యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే పాక్ క్రికెటర్ షెహ్‌జాద్, మతం మారమని కోరిన తిలకరత్నే దిల్షాన్, ముస్లిం కుటుంబంలో జన్మించాడు. తువాన్ మహమ్మద్ దిల్షాన్, అతని అసలు పేరు. అయితే బౌద్ధ మతాన్ని స్వీకరించి తన పేరును తిలకరత్నే దిల్షాన్‌గా మార్చుకున్నాడు..
అలాగే పాక్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్, 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ తర్వాత గ్రౌండ్‌లో నమాజ్ చేసిన మహ్మద్ రిజ్వాన్‌ని మెచ్చుకుంటూ కామెంట్లు చేశాడు. ‘హిందువుల మధ్య ముస్లిం, నమాజ్ చేయడం చాలా గొప్ప విషయం’ అంటూ వ్యాఖ్యానించాడు వకార్ యూనిస్..
ఈ వీడియోను కూడా షేర్ చేసిన డానిష్ కనేరియా, ‘హిందువుల ముందు నమాజ్ చేయడం, మ్యాచ్ కంటే ముఖ్యం. అసలు సమస్య ఇదే..’ అంటూ మరో ట్వీట్ చేశాడు డానిష్ కనేరియా..