పాకిస్థాన్ క్రికెట్ ను ప్రస్తుతం పిక్సింగ్ భూతం వెంటాడుతోంది. తమ దేశానికి చెందిన మాజీ ఆటగాడు ఒకరు తనను మ్యాచ్ ఫిక్సింగ్ కు సహకరించాలంటూ ఒత్తిడి తెస్తున్నాడని పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ ఆరోపిస్తున్నాడు. అయితే అందుకు నిరాకరించి అక్మల్ పాక్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇలా ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం పాక్ క్రికెట్ ను కుదిపేస్తోంది.

ప్రస్తుతం గ్లోబల్ కెనడా టీ20 లీగ్ లో ప్రపంచ దేశాలకు చెందిన అంతర్జాతీయ క్రికెటర్లు ఆడుతున్నారు. అలా పాకిస్థాన్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కూడా విన్‌పిగ్ హాక్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇదే జట్టు మేనేజ్మెంట్ విభాగంలో పాక్ మాజీ ప్లేయర్ మన్సూర్ అక్తర్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. 

ఈ లీగ్ లో భాగంగా జరుగుతున్న కొన్ని మ్యాచులను ఫిక్స్ చేయడానికి తాము నిర్ణయించుకున్నామని అక్తర్ తనకు తెలియజేసినట్లు అక్మల్ వెల్లడించాడు.అంతేకాదు ఇందులో తనను కూడా భాగస్వామ్యం కావాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించాడు. అందుకోసం తనకు భారీమొత్తం ఆఫర్ చేశాడని... అందుకు తాను తిరస్కరించినట్లు అక్మల్ తెలిపాడు.
 
ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహరంపై అక్మల్ ఇప్పటిక కెనడా లీగ్ మేనేజ్‌మెంట్ కు సమాచారం అందించాడు. అంతేకాకుండా పిసిబి అవినీతి నిరోదక విభాగానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.