యువతులను మోసం చేసిన వ్యవహారంలో పాక్ క్రికెటర్ ఇమాముల్ హక్ క్షమాపణలు చెప్పాడు. ప్రేమ పేరుతో అనేక మంది యువతులను ఇమాముల్ హక్ మోసం చేశాడని పాకిస్తాన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

తన స్టార్ డమ్‌ని ఉపయోగించి అనేకమంది యువతుల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రేమ పేరుతో వంచించాడని.. వారితో శారీరక సంబంధాలు కూడా కొనసాగించాడంటూ ఇమాముల్ చాట్ చేసిన స్క్రీన్‌ షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ప్రధానంగా చీఫ్ సెలక్టర్‌గా ఉన్న ఇంజమాముల్ హక్‌కు ఇమాముల్ మేనల్లుడు కావడంతో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో ఇమాముల్ క్షమాపణలు చెప్పినట్లుగా పీసీబీ ఎండీ వసీంఖాన్ తెలియజేశారు.

జాతీయ జట్టులో ఉంటూ ఈ తరహా వివాదం రావడం సరైంది కాదని.. దీనిపై తాము ఇమామ్‌ను వివరణ కోరినట్లుగా ఆయన వెల్లడించారు. సాధారణంగా ఆటగాళ్ల విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని.. కానీ బోర్డు కాంట్రాక్ట్ ఆటగాళ్లు ఎంతో బాధ్యతతో ఉండాలని, ఈ చర్యలు క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని వసీంఖాన్ వ్యాఖ్యానించారు.