ఎవరిని అడిగి షెడ్యూల్ ప్రకటించారు..? జై షా పై పీసీబీ చీఫ్ సెటైర్లు
INDvsPAK: ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది ఆసియా వేదికగా జరగాల్సి ఉన్న క్రికెట్ సిరీస్ లు, టోర్నీలకు సంబంధించిన షెడ్యూల్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆసియా కప్ నిర్వహణ రగడ భారత్-పాకిస్తాన్ మధ్య ఇప్పట్లో సమిసిపోయేలా కనిపించడంలేదు. గురువారం ఏసీసీ అధ్యక్షుడి స్థానంలో జై షా.. 2023తో పాటు వచ్చే ఏడాదికి గాను ఆసియాలో క్రికెట్ సిరీస్ లు, మెగా టోర్నీలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ షెడ్యూల్ లో భాగంగా ఉన్న ఆసియా కప్- 2023 నిర్వహణపై గత కొంతకాలంగా బీసీసీఐ- పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య వాగ్వాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జై షా తన ట్వీట్ లో ఈ రెండు దేశాలు ఒకే గ్రూప్ లో ఇండియా-పాక్ ఉండగా.. వేదికను మాత్రం ఖరారుచేయలేదు. పీసీబీ ఇప్పుడు ఇదే ఆయుధాన్ని ప్రయోగించింది.
జై షా ట్వీట్ చేసిన అనంతరం పీసీబీ చీఫ్ నజమ్ సేథీ తన ట్విటర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘2023-2024కు సంబంధించిన షెడ్యూల్ ను ఏకపక్షంగా ప్రకటించినందుకు థాంక్యూ జై షా.. మీరు ఏసీసీ అధ్యక్ష పదవిలో ఉన్నారు కాబట్టి మీకు ప్రస్తుత పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2023 క్యాలెండర్ గురించి కూడా తెలిసే ఉంటుంది. దానిని కూడా మీరు ప్రదర్శించవచ్చు..’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
కాగా ఇరు దేశాల మధ్య సరిహద్దుల వివాదం కారణంగా 2013 నుంచి భారత్ - పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు లేవు. అదీగాక ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహిస్తే తాము అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదని.. తటస్థ వేదికపై అయితేనే ఆడతామని జై షా గతంలో ప్రకటించాడు. దీనికి పాకిస్తాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ఈ వాదోపవాదాలు సాగుతుండగానే నిన్న జై షా తన ట్విటర్ లో షెడ్యూల్ ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది.
ఆసియా కప్ - 2023 (వన్డే ఫార్మాట్) లో భాగంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. సెప్టెంబర్ లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో ఇండియా - పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాకిస్తాన్ తో పాటు క్వాలిఫయర్ ఓ గ్రూప్ లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లు మరో గ్రూప్ లో ఉన్నాయి. ఈ సందర్భంగా షా తన ట్వీట్ లో.. ‘2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్ క్యాలెండర్ ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తుంది...’అని పేర్కొన్నాడు. 2023తో పాటు 2024లో జరుగబోయే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్) లో కూడా భారత్, పాకిస్తాన్ లు ఒకే గ్రూప్ లో ఉండటం గమనార్హం. కానీ అప్పుడు ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.