చాలాకాలం తర్వాత పాకిస్థాన్ స్వదేశంలో ఓ అంతర్జాతీయ సీరిస్ ఆడేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు భద్రతా కారణాల దృష్ట్యా పాక్ గడ్డపై అడుగుపెట్టేందుకు అంతర్జాతీయ జట్లన్ని వెనుకడుగు వేశాయి. అయితే తాజాగా శ్రీలంక మాత్రం ఆ దేశంలో పర్యటించేందుకు సిద్దమైంది. దీంతో మరికొద్దిరోజుల్లో ఇరుజట్లు మధ్య మూడు వన్డే, మూడు టీ20ల లతో సీరిస్ జరగనుంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ ఈ సీరిస్ కు సంబంధించిన విశేషాలు, వివాదాలపై క్లారిటీ ఇచ్చేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. 

ఇటీవల కాలంలో పాకిస్థాన్ ఆటగాళ్ళంతా నత్తనడకన బ్యాటింగ్ చేస్తున్నారని...ఇది ఎంతవరకు జట్టుకు సహాయపడుతుందో చెప్పాలని ఓ జర్నలిస్ట్ మిస్బాను ప్రశ్నించాడు. మీరు కూడా గతంలో ఇలాగే ఆడేవారు కదా అంటూ అతడు మిస్బాపైనే సెటైర్లు వేశాడు. ఈ టుక్ టుక్(స్లో బ్యాటింగ్) ఆటను మార్చి భ్యాట్స్ మెన్ హిట్టర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నమేమైనా చేస్తారా అంటూ సదరు జర్నలిస్ట్ ప్రశ్నించాడు. 

దీంతో చిర్రెత్తుకొచ్చినప్పటికి మిస్బా నవ్వుతూనే అతడికి తనదైన స్టైల్లో సమాధానం చెప్పాడు. ''మీ ప్రశ్న కూడా చాలా చప్పగా వుంది టుక్ టుక్ లాగే.  మీకు ఇది తప్ప వేరే గాడి(వాహనం) దొరకలేదా.(ఆటోను టుక్ టుక్ అంటుంటారు. కాబట్టి కారు లాంటిది మీకు దొరకలేదా అని అర్థం వచ్చేలా మిస్బా మాట్లాడారు).

మీరు పాక్ ప్రదర్శన కంటే ఈ టుక్ టుక్ పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. మిమ్మల్సి ఎవరో బాగా నూరిపోసి ఇక్కడికి పంపినట్లున్నారు. అందువల్లే నాకు కోపాన్ని తెప్పించే తలతిక్క ప్రశ్నలు వేస్తున్నారు. '' అంటూ నవ్వుతూనే సదరు విలేకరికి  మిస్బా చురకలు అంటించాడు. 

''శ్రీలంక పర్యటన పాక్ క్రికెట్ ను పూర్వవైభవం దిశగా నడిపిస్తుందని భావిస్తున్నా. అంతర్జాతీయ జట్లన్ని ఒకరికొకరు పరస్పర సహకారాన్ని అందించుకోవాలి. అలా కాకుంటే క్రికెట్ ఎక్కువకాలం మనుగడలో వుండదు.  కేవలం పాకిస్థాన్ నే సపోర్ట్ చేయమని నేను చెప్పడం లేదు. విపత్కర పరిస్థితుల్లో వున్న ప్రతి దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం వుంది. శ్రీలంక ప్రస్తుతం అదే పని చేస్తోంది.'' అని మిస్బా పేర్కొన్నాడు.