Asianet News TeluguAsianet News Telugu

సిరీస్ పోయినా తీరు మారని పాకిస్తాన్.. కరాచీ టెస్టులోనూ అదే కథ

PAKvsENG: ఇంగ్లాండ్ తో  స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో  ఇదివరకే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన పాకిస్తాన్  చివరి మ్యాచ్ లోనూ  తడబడుతోంది. 

Pakistan Bowled Out 304 in Karachi Test, England Takes Edge on First Day
Author
First Published Dec 17, 2022, 6:59 PM IST

రావల్పిండి, ముల్తాన్ లో ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ తిన్న  పాకిస్తాన్..  చివరిదైన కరాచీ టెస్టులో కూడా  అదే పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్..  తొలి ఇన్నింగ్స్ లో  304 పరుగులకు ఆలౌట్ అయింది.  బజ్ బాల్ ఆటతో దుమ్మురేపుతున్న  ఇంగ్లాండ్.. కరాచీలో  పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది.  స్పిన్నర్ జాక్ లీచ్ తో పాటు కొత్త కుర్రాడు రెహన్ అహ్మద్ లు రాణించడంతో   పాక్.. 79 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌట్ అయింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్ కు ఆది నుంచీ షాకులు తాకాయి.  ఓపెనర్ షఫీక్.. 8 పరుగులకే  జాక్ లీచ్ వేసిన  ఆరో ఓవర్లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ మసూద్ (30) ఫర్వాలేదనిపించినా  ఎక్కువసేపు క్రీజులో నిలువలేదు.  తన కెరీర్ లో చివరి టెస్టు ఆడుతున్న అజార్ అలీ... 68 బంతుల్లో 45 పరుగులు చేసి రాబిన్సన్ బౌలింగ్ లో ఫోక్స్ కు క్యాచ్ ఇచ్చాడు. 

అజార్ అలీతో కలిసి  మూడో వికెట్ కు 71 పరుగులు జోడించిన  కెప్టెన్ బాబర్ ఆజమ్.. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 123 బంతులాడిన బాబర్.. 9 ఫోర్ల సాయంతో 78 రన్స్ చేశాడు. బాబర్ నిలిచినా   తర్వాత  వచచ్చిన సౌద్ షకీల్ (23), మహ్మద్ రిజ్వాన్ (19) విఫలమయ్యారు.  ఈ ఇద్దరూ నిష్క్రమించిన తర్వాత  బాబర్ కూడా  రనౌట్ అయి వెనుదిరిగాడు. చివర్లో అగ సల్మాన్..  (93 బంతుల్లో 56, 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించి పాకిస్తాన్ కు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ కు నాలుగు వికెట్లు దక్కగా.. యువ స్పిన్నర్ రెహన్ అహ్మద్.. రెండు వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్, రాబిన్సన్, రూట్ లకు తలా ఓ వికెట్ దక్కింది. 

 

పాకిస్తాన్ ను 304 పరుగులకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ కు వచ్చిన ఇంగ్లాండ్ కు కూడా షాక్ తాకింది.  ఆ జట్టు ఓపెనర్ జాక్ క్రాలే తొలి ఓవర్ వేసిన అబ్రర్ అహ్మద్ బౌలింగ్ లో ఆరో బంతికి  ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. బెన్ డకెట్ (4), ఓలీ పోప్ (3) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios