Asia Cup 2023: 23.4 ఓవర్లలో 104 పరుగులకి ఆలౌట్ అయిన నేపాల్.. 238 పరుగుల తేడాతో భారీ విజయంతో బోణీ కొట్టిన పాకిస్తాన్.. 

ఆసియా కప్ 2023 టోర్నీలో భారీ విజయంతో బోణీ కొట్టింది పాకిస్తాన్. పసికూన నేపాల్‌పై పాక్ బౌలర్లు తమ ప్రతాపం చూపించడంతో మొదటి మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుకి ఘన విజయం దక్కింది. 343 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన నేపాల్ జట్టు, 23.4 ఓవర్లలో 104 పరుగులకి ఆలౌట్ అయ్యింది. కుశాల్ బుర్టెల్ 8, ఆసీఫ్ షేక్ 5 పరుగులు చేయగా కెప్టెన్ రోహిత్ పాడెల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది నేపాల్. ఈ దశలో ఆరిఫ్ షేక్, సోమ్‌పాల్ కమీ కలిసి నాలుగో వికెట్‌కి 59 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

38 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్‌ని, 46 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన సోమ్‌పాల్ కమీని హారీస్ రౌఫ్ అవుట్ చేశాడు. గుల్షాన్ జా 13, దిపేంద్ర సింగ్ ఆల్రీ 3, కుశాల్ మల్ల 6 పరుగులు చేయగా సందీప్ లామిచానే, షాదబ్ డకౌట్ అయ్యారు. 

పాక్ బౌలర్లలో షాదబ్ ఖాన్‌కి 4 వికెట్లు దక్కగా షాహీన్ ఆఫ్రిదీ, హారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీశారు. నసీం షా, మహ్మద్ నవాజ్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. 


అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 342 పరుగుల భారీ స్కోరు చేసింది.. 20 బంతుల్లో 3 ఫోర్లతో 14 పరుగులు చేసిన ఫకార్ జమాన్, కరణ్ కేసీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 5 పరుగులు చేసిన ఇమామ్ ఉల్ హక్ రనౌట్ అయ్యాడు.

25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ని మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 50 బంతుల్లో 6 ఫోర్లతో 44 పరుగులు చేసిన మహ్మద్ రిజ్వాన్, నిర్లక్ష్యంగా రనౌట్ అయ్యాుడ..
దీపేంద్ర సింగ్ వేసిన త్రో తనకి ఎక్కడ తగులుతుందోననే భయంతో వంగుతూ పరుగెత్తిన రిజ్వాన్ రనౌట్ అయ్యాడు. 14 బంతుల్లో 5 పరుగులు చేసిన అఘా సల్మాన్‌ని లమిచానే అవుట్ చేశాడు. 72 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మహ్మద్ రిజ్వాన్, 56 పరుగుల వద్ద ఇచ్చిన ఈజీ క్యాచ్‌ని కరణ్ కేసీ జారవిడిచాడు. 

అలా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బాబర్ ఆజమ్, 109 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ నుంచి సెంచరీ మార్కు అందుకోవడానికి కేవలం 37 బంతులే వాడుకున్నాడు బాబర్ ఆజమ్. మరో ఎండ్‌లో ఇఫ్తికర్ అమ్మద్, 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు.

131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 151 పరుగులు చేసిన బాబర్ ఆజమ్, ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. వస్తూనే ఫోర్ బాదిన షాదబ్ ఖాన్, చివరి బంతికి పెవిలియన్ చేరాడు. 71 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 109 పరుగులు చేసిన ఇఫ్తికర్ అహ్మద్ అజేయ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు.