PAK vs NZ 2023: పాకిస్తాన్ వేదికగా కివీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే పాకిస్తాన్.. సిరీస్ ను గెలుచుకుంది.
ఐసీసీ టోర్నీలలో భారత్ కు న్యూజిలాండ్ గండం ఎప్పుడూ పొంచే ఉంటుంది. కానీ అదే కివీస్ కు పాకిస్తాన్ అంటే భయం. ఐసీసీ టోర్నీలలో పాకిస్తాన్ చేతిలో ఓడే న్యూజిలాండ్.. తాజాగా ఆ దేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ లో కూడా ఓడింది. 12 ఏండ్ల తర్వాత కివీస్ పై వన్డే సిరీస్ ను గెలుపొందించింది. పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భాగంగా మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే పాకిస్తాన్.. 3-0 ఆధిక్యంతో సిరీస్ ను గెలుచుకుంది. పాక్ చివరిసారిగా 2011లో స్వదేశంలో కివీస్ ను ఓడించింది.
కరాచీ వేదికగా ముగిసిన మూడో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆ జట్టులో ఇమామ్ ఉల్ హక్ (90) టాప్ స్కోరర్.
గత రెండు మ్యాచ్ లలో సెంచరీలతో చెలరేగిన ఫకర్ జమాన్ ఈ వన్డేలో 19 పరుగులే చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (54) హాఫ్ సెంచరీతో రాణించాడు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (32), అగా సల్మాన్ (31) లు ఫర్వాలేదనిపించారు.
అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. 49.1 ఓవర్లలో 261 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు విల్ యంగ్ (33), టామ్ బ్లండెల్ (65) లు తొలి వికెట్ కు 83 పరుగులు జోడించి మంచి ఆరంభమే అందించారు. కానీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో కష్టాల్లో పడింది. కెప్టెన్ టామ్ లాథమ్ (45) తో కలిసి కొల్ మెక్‌కొంచి (64 నాటౌట్) చివరి వరకూ పోరాడినా ఫలితం దక్కలేదు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది, నసీమ్ షా, మహ్మద్ వసీం లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫలితంగా పాకిస్తాన్.. 26 పరుగుల తేడాతో గెలుపొందింది.
గత నెలలో పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన కివీస్.. ఐదు టీ20లు ఆడింది. టీ 20 సిరీస్ లో తలా రెండు మ్యాచ్ లు గెలిచాయి. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. ఐదు వన్డేలలో భాగంగా మూడింటినీ పాకిస్తాన్ గెలచుకుంది. ఈ సిరీస్ లో నాలుగు, ఐదు వన్డేలు మే 5, 07న కరాచీ వేదికగానే జరుగుతాయి.
