PAK vs ENG:  ఇంగ్లాండ్ బ్యాటర్ల  పరుగుల దాహానికి ప్రధాన బాధితుడిగా మారింది జహీదే.   33 ఓవర్లు వేసిన జహీద్.. ఏకంగా డబుల్ సెంచరీ కంటే ఎక్కువే  సమర్పించుకున్నాడు. 

పాకిస్తాన్ - ఇంగ్లాండ్ మధ్య రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లీష్ బ్యాటర్లు నలుగురు సెంచరీలు చేశారు. ఓ బ్యాటర్ డబుల్ సెంచరీ చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కానీ ఆ నలుగురి వల్ల కానిది పాకిస్తాన్ బౌలర్ వల్ల అయింది. ఔ బౌలర్ ఏకంగా 235 పరుగులివ్వడం గమనార్హం. లేటు వయసులో పాకిస్తాన్ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జహీద్ మహ్ముద్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్రం మ్యాచ్ లో ఏ బౌలర్ కూడా కోరుకోని అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. 

34 ఏండ్ల వయసులో పాకిస్తాన్ టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన జహీద్.. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో 33 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ల పరుగుల దాహానికి ప్రధాన బాధితుడిగా మారింది జహీదే. 33 ఓవర్లు వేసిన జహీద్.. ఏకంగా 235 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లలో ఒక్కటంటే ఒక్కటే మెయిడిన్ ఓవర్ ఉండటం గమనార్హం. ఈ క్రమంలో జహీద్ ఎకానమీ కూడా 7.10 గా ఉంది. అయితే జహీద్ నాలుగు వికెట్లు తీయడం కొంతలో కొంత ఊరట. 

ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు జాక్ క్రాలే (122), బెన్ డకెట్ (107), ఓలీ పోప్ (108), హ్యరీ బ్రూక్ (153) లు సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ ప్రదర్శనతో జహీద్.. అత్యంత చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ లో అత్యంత చెత్త ప్రదర్శన చేసి అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంక బౌలర్ సూరజ్ రణ్దీవ్ పేరిట ఉండేది. రణ్దీవ్.. 2010లో భారత్ తో మ్యాచ్ ఆడుతూ 222 పరుగులు సమర్పించుకున్నాడు. 

Scroll to load tweet…

ఈ ఇద్దరి కంటే ముందు ఇంగ్లాండ్ బౌలర్ జేసన్ క్రేజ (2008లో ఇండియా మీద.. 215 పరుగులు), వెస్టిండీస్ కు చెందిన ఒమరి బ్యాంక్స్ (2003లో ఆస్ట్రేలియా మీద 204 పరుగులు), భారత బౌలర్ నీలేశ్ కులకర్ణి (1997లో శ్రీలంక మీద.. 195 పరుగులు) ఉన్నారు.

ఇక పాకిస్తాన్ - ఇంగ్లాండ్ టెస్టు విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 101 ఓవర్లలో 657 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన పాకిస్తాన్.. 25 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ (38 నాటౌట్), ఇమామ్ ఉల్ హక్ (43 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రెండో సెషన్ ఆట సాగుతున్న సమయానికి పాకిస్తాన్ ఇంకా 574 పరుగులు వెనకబడి ఉంది. 

Scroll to load tweet…