Pakistan Vs Australia:  రావల్పిండి వేదికగా ముగిసిన తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగియడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పై ఆ జట్టు సీనియర్లు ధ్వజమెత్తుతున్నారు. ఇటువంటి పనికిమాలిన పిచ్ లను ఎందుకు తయారుచేస్తున్నారంటూ...

రాక రాక పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టు.. ఇక అమీతుమీ ఖాయమనుకున్నారు అభిమానులు.. బంతికి-బ్యాట్ కు జరిగే సమరంలో విజేతలు ఎవరవుతారో అని ఎదురుచూపులు.. కానీ ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ రావల్పిండి వేదికగా ముగిసిన తొలి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసింది. ఫలితం సంగతి అటుంచితే జీవం లేని పిచ్ పై బౌలర్లు తేలిపోయిన వేళ.. బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జీవం లేని పిచ్ ను తయారుచేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలి టెస్టు ఫలితం అక్కడి దిగ్గజ ఆటగాళ్లకు సైతం నచ్చడం లేదు. 

ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ పీసీబీపై విమర్శల వర్షం గుప్పించాడు. ఇదో పనికిమాలిన పిచ్ అని.. ఇలాంటి జీవం లేని పిచ్ ను ఎందుకు తయారుచేశారో తనకైతే అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. రావల్పిండి టెస్టు పేలవమైన డ్రా గా ముగిసిన నేపథ్యంలో ఆయన తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడారు. 

ఇంజమామ్ మాట్లాడుతూ... ‘ఈ టెస్టులో పిచ్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్ ఏంటి ఇలా ఉంది..? అని చాలా మంది అడుగుతున్నారు.. వాళ్ల ప్రశ్నలో న్యాయముంది. ఈ రోజుల్లో టెస్టు మ్యాచ్ డ్రా అయితే అది నిజంగా వింతే అనిపిస్తుంది. చివరిసారిగా మనం ఇలాంటి టెస్టును ఎప్పుడు చూశామో కూడా నాకు సరిగా గుర్తు లేదు. రావల్పిండి టెస్టు తొలి రోజే పిచ్ ఎలా ఉంటుందో నాకు అర్థమైంది.. ఇదో జీవం లేని పిచ్.. వచ్చే టెస్టులో అయినా ఇలాంటి పనికిమాలిన పిచ్ ను తయారు చేయరని ఆశిస్తున్నా..’ అని అన్నాడు.

YouTube video player

అంతేగాక.. ‘తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో పాక్ కనీసం 150 పరుగుల లీడ్ సాధిస్తుందని అనుకున్నా.. కానీ ఆస్ట్రేలియా పాక్ కు ధీటుగా బదులిచ్చింది. ఉపఖండపు పిచ్ లు స్పిన్నర్లు అనుకూలంగా ఉంటాయి అంటారు. కాబట్టి కరాచీలో జరుగబోయే రెండో టెస్టుకైనా మంచి స్పోర్టింగ్ వికెట్ తయారుచేయండి .. దయచేసి పనికిమాలిన, ఫలితం తేలని పిచ్ ల జోలికి వెళ్లకండి...’ అని ఇంజమామ్ తెలిపాడు. 

పిచ్ లు కాదు.. వాళ్ల మైండ్ కుళ్లిపోయింది : సల్మాన్ భట్ 

రావల్పిండి టెస్టులో ఫలితం రాకపోవడంపై పాక్ మాజీ సారథి సల్మాన్ భట్ స్పందిస్తూ... ‘గతంలో రావల్పిండి లో దక్షిణాఫ్రికా తో ఆడిన టెస్టులో హసన్ అలీ మెరుగైన ప్రదర్శన (రెండు టెస్టులలో ఐదు వికెట్ల ప్రదర్శన) చేశాడు. పాక్ పిచ్ లలో తప్పేంఉందో నాకు చెప్పండి. సాధారణంగా రావల్పిండి అనేది ఫలితం తేలే పిచ్. ఫస్ట్ క్లాస్ మ్యాచులలో అయితే ఈ పిచ్ లో 2.5 రోజుల్లోనే ఫలితం వస్తున్నది. కానీ ఆసీస్ తో తొలి టెస్టులో మాత్రం ఐదు రోజులైనా ఫలితం రాలేదంటే నిందించాల్సింది పిచ్ ను కాదు.. పిచ్ లను తయారుచేయిస్తున్న వారిది. ఉన్నత స్థానాల్లో (పీసీబీ లోని వ్యక్తులను ఉద్దేశిస్తూ) ఉన్న వ్యక్తుల ఆలోచన విధానం అలా దిగజారింది. మన బ్యాటర్ల మీద నమ్మకం లేనప్పుడే వాళ్లకు ఇలాంటి పిచ్ లు తయారుచేయాలనే ఆలోచనలు వస్తాయి..’ అని ధ్వజమెత్తాడు. 

రావల్పిండి టెస్టు విషయానికొస్తే.. టాస్ గెలిచిన పాక్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 476 పరుగులు చేసింది. ఇందుకు ఆసీస్ కూడా ధీటుగానే బదులిచ్చింది. కంగారూలు తొలి ఇన్నింగ్స్ లో 459 పరుగులు చేసింది. స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. మరోసారి బ్యాటింగ్ లో రెచ్చిపోయింది. వికెట్లేమీ నష్టపోకుండా 252 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్ లలో పాక్ తరఫున ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ రెండు సెంచరీలు చేశాడు. ఈ మ్యాచులో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా రెండో టెస్టు కరాచీ వేదికగా మార్చి 14న మొదలుకానుంది.