టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ పై పాక్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తాజాగా స్పందించాడు. అయితే తనదైన స్టైల్లో చలోక్తులు విసురుతూ యువీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్ కు దూరమయ్యాడు కాబట్టి ఇద్దరు పిల్లలకు తండ్రవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే ఇన్నిరోజులు తన విధ్వంసకర బ్యాటింగ్ రుచిని బౌలర్లకు చూపించడం అలవాటైవుంటుంది. కాబట్టి ఇప్పటి నుండి తన పిల్లలకు తినిపించడంతో అలవాటు చేసుకుంటాడు అంటూ యువీపై అక్తర్ చలోక్తులు విసిరాడు. 

ఇక క్రికెట్ లో యువీతో తనకు సత్సంబంధాలుండేవని పేర్కొన్నాడు. అతడు తనకంటే జూనియర్ కాబట్టి ఓ సోదరుడి మాదిరిగా భావించేవాడినని అక్తర్ తెలిపాడు. అతడి విధ్వంసాన్ని మొదట మాంచెస్టర్ మ్యాచ్ లో చూశానని...అప్పుడే అతడు గొప్ప క్రికెటర్ అవుతాడని అనుకున్నానని తెలిపాడు. టీమిండియాలోని పంజాబీ ఆటగాళ్లతో తనకు మంచి స్నేహం వుండేదని...అలా హర్భజన్, యువీలతో కూడా స్నేహంగా వుండేవాడినని అక్తర్ తెలిపాడు. 

యువీ రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ అక్తర్ ఓ వీడియోను రూపొందించి  తన యూట్యూడ్ చానెల్ లో పెట్టాడు.  '' నీతో కలిసి మైదానంలో గడిపిన సమయం చాలా తక్కువే అయినా ఎతో మధురమైంది. నీ కెరీర్ ను ఇంత సక్సెస్ ఫుల్ గా సాగించినందుకు అభినందనలు.  అంతర్జాతీయ క్రికెట్ ఓ మ్యాచ్ విన్నర్ ను కోల్పోయింది'' అంటూ యువీని పొగుడాడు ఈ పాకిస్థానీ మాజీ పేసర్.