పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ గాయం కారణంగా శ్రీలంకతో జరుగుతున్న వన్డే సీరిస్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే ఇదే విషయం గురించి ప్రశ్నించి ఓ విలేకరి స్పిన్నర్ షాదబ్ ఖాన్ ఇబ్బందిపెట్టాలని చూశాడు. కానీ అతడు తన టైమింగ్ పంచులతో సదరు విలేకరికి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. షాదాబ్ సమాధానం ప్రెస్‌మీట్ లో నవ్వులు పూయించింది. 

శ్రీలంక తో కరాచీ వేదికన ఇవాళ(సోమవారం) పాక్ రెండో వన్డేలో తలపడాల్సి వుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు షాదబ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ హసన్    జట్టుకు దూరమవడంపై ఇలా ప్రశ్నించాడు.'' మీకు హసన్ తో మంచి స్నేహం వుంది. అతడు లేకుండా ఇప్పటివరకు మీరు అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన సందర్భాలు లేవు. ఇప్పుడిలా అతడు లేకుండా ఆడాల్సి రావడంపై మీరెలా పీల్ అవుతున్నారు..?'' 

ఈ ప్రశ్నకు షాదాబ్ చెప్పిన సమాధానం ప్రెస్ మీట్ లో నవ్వులు పూయించింది. '' మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే. మేమేదో భార్యాభర్తలమైనట్లు మీరు భావిస్తున్నట్లున్నారు. ఎంతమాత్రం కాదు. 

అవును...నిజంగానే అతన్ని మిస్ అవుతున్నా. చాలాకాలంగా అతడితో కలిసి ఆడుతున్నా. కేవలం నేనే కాదు జట్టు సభ్యులందరు అతన్ని చాలా మిస్ అవుతున్నారు. హసన్ చాలా సరదాగా వుండే వ్యక్తి. డ్రెస్సింగ్ రూంలో కూడా చిలిపిచేష్టలతో అందరినీ నవ్విస్తూ వుంటాడు. వీటన్నింటితో పాటు ప్రధానంగా అతడి ఆటను మిస్సవుతున్నాం.''  అని షాదాబ్ వెల్లడించాడు. 

చాలాకాలం తర్వాత స్వదేశంలో క్రికెట్ ఆడేందుకు సిద్దమైన పాకిస్థాన్ జట్టుకు అడుగడుగున ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే భద్రతా కారణాలతో శ్రీలంక ఆటగాళ్లు కొందరు పాకిస్థాన్ పర్యటనకు దూరమయ్యారు. ఆ తర్వాత ఎలాగోలా లంక జూనియర్లు పాక్ లో అడుగుపెట్టినా వర్షాల కారణంగా వన్డే సీరిస్ కు అంతరాయం ఎదురవుతోంది. ఇప్పుడు తాజాగా హసన్ అలీ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. ఇలా వరుస సమస్యలతో సతమతమవుతున్న పాక్ ఇవాళ(సోమవారం) రెండో వన్డే కోసం సిద్దమయింది.