పుల్వామా దాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్ దేశాల మధ్య రాజకీయ, దౌత్య  సంబంధాలే కాదు క్రికెట్ సంబంధాలు కూడా మరింత దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సీరిస్ లకు దూరంగా వుంటుండగా పుల్వామా  దాడి ఎఫెక్ట్ ఐసిసి మ్యాచులపై కూడా పడింది. ఐసిసి నిర్వహించే ప్రపంచ కప్ మెగా టోర్నీలో పాక్ జట్టుతో జరగనున్న మ్యాచ్ ను నిషేధించాలంటూ టీమిండియా మాజీలు, భారత అభిమానులు డిమాండ్  చేస్తున్నారు. ఇలా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్ధితులతో క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితులు నెలకొన్న సమయంలో ఓ పాక్ క్రికెటర్ టీమిండియా మాజీ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ సంచలనం  సృష్టించాడు. 

పాకిస్థాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షాజాద్‌ ట్విట్టర్ వేదికగా సచిన్‌ పై ప్రశంసల వర్షం కురింపించాడు. క్రికెట్ కు సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినా అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ అద్భుతమైన ఆటగాడని పేర్కొన్నారు. అతడి బ్యాటింగ్ స్టైల్, సాధించిన పరుగుల రికార్డులు మరెవరికి సాధ్యం కావన్నాడు.  ప్రపంచ క్రికెట్ లో  సచిన్‌ ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్‌మన్ అని షాజాద్ పేర్కొన్నాడు. 

ఓ అభిమాని సచిన్ గురించి చెప్పండని షాజాద్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అతడు సచిన్ '' ఆల్ టైమ్ ఉత్తమ బ్యాట్ మెన్, రోల్ మోడల్, అన్నింటికంటే మానవత్వమున్న మంచి  వ్యక్తి. అతడు ప్రతి ఒక్కరిని ఒకేలా గౌరవిస్తుంటారు'' అని పేర్కొన్నారు. ఈ  లక్షణాలన్ని కలిగివుండటం వల్ల సచిన్ ను అంతలా అభిమానిస్తానని షాజాద్ వెల్లడించాడు.