ప్రపంచ కప్ కు ముందు పాకిస్థాన్ జట్టులో అలజడి మొదలయ్యింది. గతంలో ప్రపంచ కప్ కోసం ఎంపికచేసిన పాక్ జట్టులో చోటు దక్కించుకుని సంబరాలు చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాకిచ్చింది. మరో పదిరోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభమవుతుందనగా పాక్ ఛీప్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ షాకింగ్ ప్రకటన చేశాడు. గతంలో ప్రపంచ కప్ కోసం ప్రకటించిన పాక్ జట్టును మార్పులు చేశామన్నది ఆ ప్రకటన సారాంశం. ఇలా సెలెక్టర్ల నిర్ణయానికి బలైన ఆటగాళ్లు తీవ్ర మనస్థాపంలో నిరసన బాట పట్టారు. 

ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ ఆష్రఫ్‌, పేసర్‌ జునైద్‌ ఖాన్‌తో పాటు అబిద్‌ అలీ లు పాక్ జట్టులో చోటు కోల్పోయారు. వారి స్థానంలో అమీర్, వాహబ్ రియాజ్, అసిఫ్ అలీలకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. ఇలా సెలెక్టర్ల నిర్ణయంతో గతంలో నిరాశకు గరయిన ఆటగాళ్లు  ఆనందంలో మునిగిపోగా...గతంలో సంబరాలు చేసుకున్న ఆటగాళ్లు బాధలోకి జారుకున్నారు. ఇలా సెలక్టర్ల నిర్ణయానికి బలైన  జునైద్ ఖాన్ వినూత్న నిరసనకు దిగాడు. 

వరల్డ్‌కప్‌ జట్టు నుంచి తనను తప్పించడంపై పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌  ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ''ప్రస్తుతం నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది.'' అని పేర్కొంటూ  నోటికి నల్లటి ప్లాస్టర్ అంటించుకుని దిగిన ఫోటోను ఆ ట్వీట్ కు జతచేశాడు. ఇలా తనకు జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడలేని పరిస్థితిలో వున్నానంటూ జునైద్ పరోక్షంగా అభిమానులతో తన ఆవేదన పంచుకున్నాడు. 

అయితే సెలెక్టర్లు మాత్రం పాక్ జట్టును ప్రపంచ కప్ విజేతగా నిలపాలన్నదే తమ లక్ష్యమని... అందుకోసం ఎలాంటి కఠిన నిర్ణయాలైన తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్‌తో ముగిసినవన్డే సిరీస్‌లో తమ ఆటగాళ్లు స్థాయికి తగ్గ మేర రాణించలేకపోయారని.. అందుకే జట్టు కూర్పుపై మరోసారి కసరత్తు చేశామన్నారు. అలా ఆకట్టుకోలేకపోయిన ఆటగాళ్లను మాత్రమే ప్రపంచ కప్మ జట్టు నుండి తొలగించినట్లు చీఫ్ సెలెక్టర్ ఇంజమామ్ వెల్లడించారు.