Asianet News TeluguAsianet News Telugu

అబ్బాయిలూ.. ఐపీఎల్‌లో అదరగొడితే చాలదు.. దేశవాళీలో దుమ్ము రేపాలి.. అప్పుడే టీమిండియాలోకి ఎంట్రీ..

IPL 2023: టీమిండియాలోకి రావాలంటే  ఒక్క ఐపీఎల్ సీజన్ లో అదరగొడితే  సరిపోతుందన్న భ్రమలను  తొలగిస్తూ బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుంది.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న బీసీసీఐ కూడా ఆలస్యంగా  కండ్లు తెరిచింది.

One Great IPL Season Should Not Be Considered as Entry Pass to Team India
Author
First Published Jan 2, 2023, 4:26 PM IST

ఒకప్పుడు క్రికెటర్లు జాతీయ జట్టు తరఫున ఆడాలంటే  తమ రాష్ట్ర జట్లకు ఎంపికై  ఆ తర్వాత ఫస్ట్ క్లాస్  క్రికెట్ లో టన్నుల కొద్దీ పరుగులు చేసి సెలక్టర్ల దృష్టిలో పడితే గానీ   టీమిండియాకు ఆడే అవకాశం లేకుండా పోయేది.  కానీ  ఐపీఎల్ వల్ల  ఆ పద్ధతి కాస్త సైడ్ ట్రాక్ అయింది.   ఒక ఐపీఎల్ సీజన్లో మెరిసి.. అదే ఊపును రెండో సీజన్ లో కూడా కంటిన్యూ చేస్తే అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు క్రికెట్  పండితులు కూడా.. ‘ఇంకెంతకాలం అతడిని  పక్కనబెడతారు..?’ అని వ్యాఖ్యలు చేస్తారు. తీరా  సదరు ఆటగాడు  జాతీయ జట్టులోకి వచ్చాక  తుస్ మనిపిస్తే కథ మళ్లీ మొదటికి. అటు  కీలక టోర్నీలలో ఆటగాళ్ల వైఫల్యం వల్ల జట్టు పరువు పోగా ఇటు వ్యక్తిగత ప్రదర్శన బాగోలేదనే కారణంతో  సదరు ఆటగాడిపై వేటు తప్పదు.  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న బీసీసీఐ కూడా ఆలస్యంగా  కండ్లు తెరిచింది.

జాతీయ జట్టుకు రావాలంటే  ఒకటి రెండు ఐపీఎల్ సీజన్లలో అదరగొడితే చాలదని,   దేశవాళీలో తమ ప్రతిభను నిరూపించుకుని నిలకడగా రాణిస్తేనే  టీమిండియాకు ఎంపికవుతారని కొత్త నిబంధనను తీసుకురానుంది.  ఈ మేరకు  ఆదివారం  జరిగిన బీసీసీఐ రివ్యూ మీటింగ్ లో దీనిపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. 

గత రెండేండ్లలో టీమిండియా తరఫున ఆడిన వెంకటేశ్ అయ్యర్, రాహుల్ చాహర్,  వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్  వంటి ఆటగాళ్లు ఇలా వచ్చినోళ్లే. ఐపీఎల్ లో తమ ఫ్రాంచైజీల తరఫున అదరగొట్టిన  ఈ క్రికెటర్లు  ఆనతి కాలంలోనే జాతీయ  జట్టులో చోటు దక్కించుకున్నారు.  కానీ తీరా చూస్తే అంతర్జాతీయ వేదికపై బోల్తా కొట్టారు.   ఒక్కసారి జట్టులో చోటు కోల్పోయాక వీళ్లు మళ్లీ పత్తా లేకుండా పోయారు.  అదే సమయంలో ఐపీఎల్ లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చిన వారిలో అర్ష్‌దీప్ సింగ్, దీపక్ హుడా వంటి ఆటగాళ్లు  నిలకడైన ప్రదర్శనలతో జట్టులో స్థానం నిలుపుకున్నారు.  ముఖ్యంగా అర్ష్‌దీప్ అయితే అతి తక్కువ కాలంలోనే   టీమిండియాకు ప్రధాన పేసర్ గా మారాడు. బుమ్రా లేని లోటును అతడు తీరుస్తున్నాడు. 

బోర్డు సమావేశంలో కూడా ఇదే విషయం చర్చకు వచ్చినట్టు సమాచారం. వర్ధమాన ఆటగాళ్లు జాతీయ  క్రికెట్ జట్టుకు ఆడాలంటే దేశవాళీలో తప్పక ఆడాలనే నిబంధనను తీసుకురానున్నట్టు తెలుస్తున్నది.  అంతేగాక  జాతీయ జట్టుకు ఎంపికైనా యోయో టెస్టు, డెక్సా టెస్టు కచ్చితంగా  పాస్ కావాలి.  ఇన్ని అడ్డంకులను అధిగమిస్తేనే  జాతీయ జట్టులో రాటుదేలతారని  భారత క్రికెట్ పెద్దలు భావిస్తున్నారు. 

కాగా వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని  బీసీసీఐ.. ఆదివారం ఓ కోర్ గ్రూప్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.   20 మంది క్రికెటర్లతో  ఓ గ్రూప్ ను తయారుచేసి వారినే రొటేషన్ పద్ధతిలో  సిరీస్ లు ఆడించనున్నది.  ప్రపంచకప్ వరకు వారిని సన్నద్ధం చేసి  బరిలోకి దించాలన్నది బీసీసీఐ ప్రణాళికలో భాగంగా ఉంది. బీసీసీఐ సూచించే ఈ కోర్ గ్రూప్ లోని ఆటగాళ్ల బాధ్యత ఎన్సీఏదే.  ఐపీఎల్ తో పాటు ఆ ఆటగాళ్ల ఫిట్నెస్, గాయాలు, వర్క్ లోడ్ తదితర విషయాల కోసం ఎన్సీఏలోని ఓ ప్రత్యేక విభాగం పర్యవేక్షించనున్నట్టు తెలుస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios