IPL2022 Auction Live Updates: వేలంలో పాల్గొనబోయే ఆటగాళ్లు సుమారు 600 మంది ఉన్నారు. ఉన్న స్లాట్స్ 217. ఖర్చు చేయాల్సిన మొత్తం 500 కోట్ల రూపాయల పైమాటే..  

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో బెంగళూరు వేదికగా నిర్విహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ద్వారా 33 మంది టాప్ ఆటగాళ్లను దక్కించుకున్న వివిధ ఫ్రాంచైజీలు.. పూర్తి జట్టును నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లన్నీ రేపు వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జీరోలను హీరోలుగా మార్చబోయే మెగా వేలం గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం.. 

శనివారం, ఆదివారం జరుగబోయే ఐపీఎల్ వేలం ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్ లో కొత్తగా వచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తో పాటు పాత 8 ఫ్రాంచైజీలు గెలుపు గుర్రాల కోసం పోటీ పడనున్నాయి. మరి అనామకులను ఓవర్ నైట్ స్టార్లు గా చేసిన ఈ ఐపీఎల్ వేలంలో రేపు, ఎల్లుండి కోటీశ్వరులయ్యేదెవరు..? తమ ఇల్లు, ఊరు కూడా దాటి తెలియని ఎంతో మంది ఆటగాళ్లు రేపటి నుంచి ప్రపంచానికి పరిచయం కాబోతున్నారు. 

250 మందికి రూ. 900 కోట్లు 

ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ వేలంలో 217 స్లాట్లు ఉన్నాయి. ఇందుకోసం సుమారు 600 మంది పోటీ పడుతున్నారు. వేలంలో స్లాట్లు దక్కించుకునే సుమారు 250 మంది ఆటగాళ్లకు రూ. 900 కోట్లు (ఈపాటికే రిటైన్ చేసుకున్న 33 మందితో కలిపి) దక్కనున్నాయి. 

ఆక్షన్ ముచ్చట్లు : 

- పాల్గొనే ఫ్రాంచైజీలు 10.. ఇప్పటికే రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల సంఖ్య 33. 
-వేలంలో ఉన్న ఆటగాళ్లు 590 (ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు సమాచారం). ఇందులో ఇండియా నుంచి 370 మంది ఉండగా.. 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. 
- హయ్యస్ట్ బేస్ ప్రైజ్ (రూ. 2 కోట్లు) లో ఉన్న ఆటగాళ్లు 48 మంది. ఇందులో భారత ఆటగాళ్లు 17 మంది ఉన్నారు. ఇక రూ. 1.5 కోట్ల రిజర్వ్ ప్రైస్ జాబితాలోఇండియా నుంచి 20 మంది క్రికెటర్లు ఉన్నారు. కోటి రూపాయల రిజర్వ్ ధరలో 34 మంది ఉన్నారు.
- మొత్తం వేలంలో రూ. 900 కోట్లు ఖర్చు చేయవచ్చు. ఇప్పటికే రిటెన్షన్ ద్వారా రూ. 384.5 కోట్లు ఖర్చు చేశాయి. అది పోగా ఫ్రాంచైజీ దగ్గర మిగిలిన మొత్తం రూ. 561.5 కోట్లు 
- శని, ఆదివారాలలో జరుగబోయే వేలంలో రూ. 561.5 కోట్లను 217 మంది (ఇన్ని స్లాట్లు ఉన్నాయి) ప్లేయర్ల మీద ఖర్చు చేయవచ్చు. 
- - విదేశీ ఆటగాళ్లలో వేలం నుంచి పాల్గొనబోయే వారిలో ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది (47 మంది) ఉన్నారు. ఆ తర్వాత జాజితాలో వెస్టిండీస్ (34), సౌతాఫ్రికా (33), ఇంగ్లాండ్ (24), న్యూజిలాండ్ (24), ఆఫ్గానిస్థాన్ (17), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (5), శ్రీలంక (23), జింబాబ్వే (1), నమీబియా (3), నేపాల్ (1), స్కాట్లాండ్ (2), యూఎస్ఎ (1) ల నుంచి ఉన్నారు.

Scroll to load tweet…

ఎక్కడ జరుగుతుంది..?

బెంగళూరు లోని ఐటీసీ గార్డెన్ హోటల్ లో రెండ్రోజుల పాటు ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఇందుకోసం బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నేపథ్యంలో వేలం జరుగబోయే పాటించాల్సిన నిబంధనలపై కూడా ఈపాటికే ఆయా ఫ్రాంచైజీలకు అవగాహన కల్పించింది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఆక్షన్ కోసం ఫ్రాంచైజీల ప్రతినిధులంతా రూ. 11 గంటలకే ఆడిటోరియానికి చేరుకోవాలి. 

ఎందులో చూడొచ్చు..? 

ఆక్షన్ ను లైవ్ ద్వారా వీక్షించొచ్చు. ఈ మేరకు బీసీసీఐ అఫిషియల్ బ్రాడ్ కాస్ట్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్.. ఐదు భాషల్లో ప్రసారం చేయనుంది.