ఎన్నో ఆశలతో అంచనాలతో 2019 వన్డే ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన టీమిండియా సెమీఫైనల్‌లో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. గతేడాది సరిగ్గా ఇదే రోజున ప్రపంచకప్ నుంచి కోహ్లీ సేన వైదొలగింది. దీనిని తలచుకుంటే అభిమానుల గుండెలు ఇప్పటికీ బరువెక్కుతాయి.

భారత్- న్యూజిలాండ్‌ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో.. ప్రత్యర్థి జట్టు టీమిండియా ముందు 240 పరుగుల విజయ లక్ష్యాన్ని వుంచింది. అప్పటికే భారత్ 92 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తోంది.

ఈ దశలో క్రీజులో ఉన్న ధోనీ, రవీంద్ర జడేజాలు జట్టును ఓటమి నుంచి తప్పించే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇద్దరు కలిపి 7వ వికెట్‌కు అబేధ్యమైన 116 పరుగులు జోడించారు.

కాగా జట్టు స్కోరు 2017 పరుగుల వద్ద ఉన్నప్పుడు 77 పరుగులు చేసిన జడేజా క్యాచ్‌గా పెవిలియన్‌కు చేరాడు. అయినప్పటికీ భారత అభిమానులు ఏ మాత్రం నిరాశ చెందలేదు. ఎందుకంటే అప్పటికే మిస్టర్ కూల్ ధోనీ క్రీజులో పాతికుపోయి ఉన్నాడు.

2011 ప్రపంచకప్ ఫైనల్ నాటి ప్రదర్శనను మరోసారి రిపీట్ చేస్తాడని భావించారు. లార్డ్స్‌లో జరిగే ఫైనల్‌లో టీమిండియా ఉంటుందనే అంతా భావించారు. అయితే సరిగ్గా విజయానికి 24 పరుగుల దూరంలో ఉన్నప్పుడు ధోని రనౌట్ అయ్యాడు.

 

 

అంతే స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ధం రాజ్యమేలింది. అప్పటిదాకా ధోని ఉన్నాడనే ధైర్యంతో కేరింతలు కొట్టిన భారత అభిమానుల గుండెలు రెప్పపాటులో పగిలిపోయాయి. కోహ్లీ సేనను ఫైనల్లో చూస్తామన్న వారి కలలు కల్లలయ్యాయి.

అలా చూస్తుండగానే భారత్ ఇన్నింగ్స్‌ కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో కివీస్.. భారత్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. అయితే ధోని ఒక్క పరుగుతో సరిపెట్టుకోకుండా.. రెండో పరుగు కోసం ప్రయత్నించడం వల్లే భారత్ ఓడిందని అప్పట్లో చాలా మంది విమర్శించారు.

ఈ సన్నివేశం భారత క్రికెట్‌ను, అభిమానులను చాలా కాలం వెంటాడింది. ఈ ఘటనకు ఏడాది కావొస్తుండటంతో ఐసీసీ ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ధోని రనౌట్ అవ్వడాన్ని ట్వీట్ చేసింది.