Asianet News TeluguAsianet News Telugu

Lala Amarnath: టెస్టులలో ఇండియా తరఫున తొలి శతకం నమోదైంది ఈరోజే.. సెంచరీ హీరో ఎవరో తెలుసా..?

On This Day In History: క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్ జట్టు 1933లో భారత పర్యటనకు వచ్చింది. అప్పటికే మనను పాలిస్తున్న బ్రిటన్ ను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. జాతిపిత  మహాత్మ గాంధీ నేతృత్వంలో స్వతంత్ర్య సంగ్రామం  ఉధృతంగా సాగుతున్న రోజులవి.. అదే సమయంలో.. 

On This Day, Dec 17 1933, Former Indian Cricketer Lala Amarnath Scores India's First Test Century Against England
Author
Hyderabad, First Published Dec 17, 2021, 12:23 PM IST

సుదీర్ఘమైన చరిత్ర కలిగిన భారత క్రికెట్ లో ఎంతో మంది ఆటగాళ్లు పరుగుల వరద  పారించారు. సెంచరీల మోత మోగించారు. ప్రపంచ క్రికెట్ లో చెరిగిపోని రికార్డులను నెలకొల్పారు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ వంటి ఆ తరపు దిగ్గజాలే గాక  ఆధునిక క్రికెట్ లో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు టెస్టు, వన్డే క్రికెట్ లోనే కాదు.. 20 ఓవర్ల క్రికెట్ లో మంచినీళ్లు తాగిన చందంగా సెంచరీలు చేస్తున్నారు. అయితే అసలు  భారత క్రికెట్ (టెస్టులలో) తొలి సెంచరీ ఎవరు చేశారో తెలుసా..? అది ఏ జట్టు మీద...? ఏ సంవత్సరంలో..? ఇది తెలియాలంటే  చరిత్రను తిరగేయాల్సిందే. 

టెస్టు క్రికెట్ లో భారత్ తరఫున తొలి  సెంచరీ నమోదు  చేసిన ఆటగాడు లాలా అమర్నాథ్. 1933లో ఇంగ్లాండ్ పై ఆయన స్వదేశంలోనే  శతకం బాదాడు. 1933  డిసెంబర్ 17న అమర్నాథ్..  ఇండియా తరఫున టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రలో తనకంటూ ఎప్పటికీ చెరిగిపోని పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. 

క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లాండ్ జట్టు 1933లో భారత పర్యటనకు వచ్చింది. అప్పటికే భారత్ ను  పాలిస్తున్న బ్రిటన్ ను దేశం నుంచి తరిమికొట్టాలని ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. జాతిపిత  మహాత్మ గాంధీ నేతృత్వంలో స్వతంత్ర సంగ్రామం  ఉధృతంగా సాగుతున్న రోజులవి.  అదే సమయంలో డగ్లస్ జార్డైన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు.. భారత పర్యటనకు వచ్చింది. సీకే నాయుడు భారత కెప్టెన్.  ముంబయిలో ఫస్ట్ టెస్టు. డిసెంబర్ 15 నుంచి 18 వరకు సాగింది. 

అనుకున్నట్టుగానే అంతగా అనుభవం లేని భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లాండ్ పేసర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్ లో 219 పరుగులకే బౌల్డ్ ఔట్ అయింది. లాలా అమర్నాథ్ 38 పరుగులతో టాప్ స్కోరర్. బదులుగా తర్వాత  బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 438 పరుగులు చేసింది. బ్రియాన్ వాలెంటైన్ (136) సెంచరీ చేశాడు. ఇండియన్ స్పిన్నర్ మహ్మద్ నిస్సార్.. 5 వికెట్లు తీసుకున్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్  మొదలుపెట్టింది. కానీ 21 పరుగులకే ఓపెనర్లు సయ్యీద్ వాజిర్ అలి, జనార్ధన్ లు నిష్క్రమించారు. 

అప్పుడు వచ్చాడు అమర్నాథ్. కెప్టెన్ సీకే నాయుడుతో కలిసి.. భారత ఇన్నింగ్స్ కు ప్రాణం పోశాడు. ఆ క్రమంలోనే భారత టెస్టు క్రికెట్ లో తొలి సెంచరీ (118) సాధించాడు. 118 పరుగులలో.. 21 బౌండరీలు కూడా ఉన్నాయి. అది భారత్ కు రెండో టెస్టు కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచులో సీకే నాయుడుతో కలిపి లాలా.. 186 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచులోనే విజయ్ మర్చంట్, రుస్తోమ్జీ జంషెడ్జీ లు రంగ ప్రవేశం చేశారు. ఆ ఇద్దరితో కూడా లాలా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్ ను ఇన్నింగ్స్ ఓటమి నుంచి రక్షించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో  భారత్.. 258 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ ను రెండోసారి బ్యాటింగ్ కు రప్పించింది. 

ఇదిలాఉండగా.. ఈ టెస్టు తర్వాత 24 టెస్టులు ఆడిన అమర్నాథ్.. ఒక్క సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. జాతీయ జట్టుకు కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం ఆయన పరుగుల వరద పారించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 186 మ్యాచులు ఆడిన లాలా.. ఏకంగా 10,426 పరుగులు సాధించడం విశేషం. సగటు 41.37 తో 31 సెంచరీలు కూడా చేశాడు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అమర్నాథ్ రాణించాడు. తన కెరీర్ లో 45 వికెట్లు కూడా పడగొట్టాడు ఈ లెజెండరీ క్రికెటర్. 1911 లో పంజాబ్ లోని కపుర్తలా లో పుట్టిన అమర్నాథ్.. భారత్ లో క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు.  2000 ఆగస్టులో ఆయన న్యూఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios