Olympic Gold-Medalist Banned in Pak:  మన పొరుగు దేశం పాకిస్థాన్ లో  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను  విమర్శించాడనే  కారణంగా  గతంలో దేశానికి ఒలింపిక్ స్వర్ణాన్ని అందించిన క్రీడాకారుడిపై...

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను విమర్శించినందుకు గాను దేశానికి ఒలింపిక్ స్వర్ణ పతకం అందించిన ఓ క్రీడాకారుడు పదేండ్ల నిషేధానికి గురయ్యాడు. 1984లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం గెలిచిన పాకిస్థాన్ హాకీ జట్టులో రషీద్ ఉల్ హసన్ సభ్యుడు. కొద్దిరోజుల క్రితం అతడు సామాజిక మాధ్యమాల వేదికగా ఇమ్రాన్ ఖాన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హాకీ తాజా పరిస్థితులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇమ్రాన్ ఖాన్ ను అనరాని మాటలు అన్నాడని రషీద్ పై ఆరోపణలున్నాయి. 

ఈ మేరకు పాకిస్థాన్ లో ప్రముఖ పత్రిక డాన్ లో ఇందుకు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ప్రధానిగా గద్దెనెక్కి మూడేండ్లు గడుస్తున్నా ఇమ్రాన్ ఖాన్ మాత్రం హాకీ పై చిన్నచూపు చూస్తున్నారని రషీద్ ఆరోపించినట్టు సమాచారం. అధికారంలోకి రాకముందు దేశంలో హాకీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. తర్వాత ఆ విషయాన్ని మరిచారని ఆరోపిస్తూ రషీద్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది.

దీంతో పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) రషీద్ పై పదేండ్ల నిషేధాన్ని విధించింది. ఇప్పటికైతే అతడు పీహెచ్ఎఫ్ లో సభ్యుడు కాదు. ఎటువంటి పదవిలో కూడా లేడు. కానీ పీహెచ్ఎఫ్ తీసుకున్న తాజా నిర్ణయం అతడి భవిష్యత్, ప్రతిష్ట మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. రషీద్ పై నిషేధం విధించిన పీహెచ్ఎఫ్.. ఇమ్రాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈపాటికే రెండు నోటీసులు పంపింది. 

Scroll to load tweet…

అయితే ఈ నోటీసులకు రషీద్ వివరణ ఇవ్వకపోగా.. ప్రధానిపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదని స్పష్టం చేశాడు. ‘సోషల్ మీడియాలో గానీ ఇతర మాధ్యమాలలో గానీ ఇమ్రాన్ ఖాన్ పై నేను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చేయలేదు. అతడిపై నాకు గౌరవమున్నది..’ అన్న రషీద్.. ‘తాను అధికారంలోకి వస్తే దేశంలో హాకీని అభివృద్ధి బాట పట్టిస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ మూడేండ్లైనా దాని గురించి పట్టించుకోవడం లేదు అని ఒక వాట్సాప్ గ్రూప్ లో పేర్కొన్నాను. కానీ నేను అందులో అభ్యంతరకర పదాలేమీ వాడలేదు..’ అని తెలిపాడు. 

దేశ పౌరుడిగా అభిప్రాయాలను వెల్లడించే అధికారం తనకు ఉన్నదని రషీద్ అన్నాడు. ఇక తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా పీహెచ్ఎఫ్ పంపిన నోటీసులపై స్పందిస్తూ.. ‘వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన పన్లేదు.. ’ అని చెప్పాడు.