మౌంట్ మౌంగనీ: మూడు వన్డేల సిరీస్ ను వైట్ వాష్ చేసి టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ అనుకుంటోంది. చివరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని ఇండియా తాపత్రయ పడుతోంది. ఇరు జట్ల మధ్య చివరి వన్డే రేపు మంగళవారం జరగనుంది. 

ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను ఇండియా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ ఆటగాళ్లు పలువురు గాయాలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ క్లీన్ స్వీప్ చేసేందుకు సమాయత్తమవుతోంది. రెండో వన్డేలో ఆటగాళ్లు గాయాల పాలు కావడంతో అసిస్టెంట్ కోచ్ లూక్ రోంచీ ఫీల్డింగ్ కు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

సౌథీ తన పది ఓవర్ల కోటాను ముగించిన తర్వాత మైదానం వీడి వెళ్లాడు. దాంతో రోంచీ ఫీల్డింగ్ కు రాక తప్పలేదు. అయితే, కేన్ విలియమ్సన్ మూడో వన్డేలో బరిలోకి దిగే అవకాశం ఉంది.  విలియమ్సన్ ట్రైనింగ్ సెషన్ లో పాల్గొన్నాడని, అతను కోలుకున్నాడని కోచ్ షేన్ జుర్గేన్సన్ చెప్పాడు. అయితే, మ్యాచ్ కు ముందు విలియమ్సన్ బరిలోకి దిగుతాడా, లేదా అనేది తేలుతుందని ఆయన అన్నాడు. 

రెండు జట్ల తీరును బేరీజు వేస్తే టాప్ ఆర్డర్ తోనే తేడా వస్తున్నట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ దూరం కావడంతో భారమంతా విరాట్ కోహ్లీపై పడుతోంది. అతను కూడా రెండు వన్డేల్లోనూ పెద్దగా రాణించలేదు. ఓపెనింగ్ జంట పృథ్వీషా, మాయాంక్ అగర్వాల్ కొన్ని మెరుపులు మెరిపిస్తున్నారే తప్పఇన్నింగ్సును నిర్మించలేకపోతున్నారు. 

 

రోహిత్ శర్మ లేకపోవడం ఇండియా బ్యాటింగ్ పై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఓపెనర్ గా వన్డేల్లో గత 12 నెలలుగా అతని సగటు 57.30 ఉంది. విరాట్ కోహ్లీ రెండు మ్యాచుల్లోనూ కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 సిరీస్ లో 4-0తో మౌంట్ మౌంగనీలో అడుగుపెట్టిన ఇండియా ఐదో మ్యాచు కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే, ఇండియా వన్డేల్లో అందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. 

మూడో వన్డేలో కూడా ఇండియా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. రాహుల్, షా, శ్రేయస్, కేదార్ జాదవ్, యుజువేంద్ర చాహల్ సోమవారం ఆప్షనల్ ప్రాక్టీస్ లో పాల్గొనలేదు.  మనీష్ పాండే సెషన్ లో కనిపించాడు. రిషబ్ పంత్ సుదీర్ఘంగా పాల్గొన్నాడు. 

ఆస్ట్రేలియాతో రిషబ్ పంత్ చివరి మ్యాచ్ ఆడాడు. ఇండియా రొటీన్ ప్లాన్ తోనే మైదానంలోకి దిగితే రిషబ్ పంత్ వైట్ బాల్ క్రికెట్ నుంచి అతను పూర్తిగా దూరమైనట్లు లెక్క. పేలర్లలో మొహమ్మద్ షమీ మినహా అందరూ ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్నారు. 

న్యూజిలాండ్ విషయానికి వస్తే సోథీ,త పేసర్ బ్లెయిర్ టిక్నెర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సోధీ హామిల్టన్ తొలి వన్డేలో ఆడాడు. గూగ్లీతో విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. టీమ్ సౌథీ, మిచెల్ సాంత్నర్, స్కాట్ కుగ్గెలీన్ మూడో వన్డేకు కోలుకునే అవకాశం ఉంది. 

జట్లు: 

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మార్టిన్ గుప్తిల్, రాస్ టైలర్, కోలిన్ డీ గ్రాండ్ హోమ్, జమ్మీ నీషమ్, స్కాట్ కుగ్గెలీన్, టామ్ బ్లండెన్, హెన్రీ నికోలస్, మిచెల్ సాంత్నర్, హమీష్ బెన్నెట్, టిమ్ సౌథీ, కైల్ జమీషన్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్