NZvsENG: న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ ఆటతో ఆథిత్య జట్టుకు చుక్కలు చూపిస్తున్నది.  రెండో ఇన్నింగ్స్ లో కివీస్ ముందు 394 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన ఆ జట్టు విజయానికి చేరువైంది. 

ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య మౌంట్ మోంగనుయి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో బెన్ స్టోక్స్ సారథ్యంలోని పర్యాటక జట్టు విజయం దిశగా సాగుతోంది. న్యూజిలాండ్ ఎదుట భారీ టార్గెట్ నిలిపిన ఆ జట్టు.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు కీలక వికెట్లు పడగొట్టి విజయానికి చేరువైంది. ఇంగ్లీష్ వెటరన్ సీమర్ స్టువర్ట్ బ్రాడ్ దెబ్బకు కివీస్ టాపార్డర్ కకావికలమైంది. ఆతిథ్య జట్టు ముందు 394 పరగుల భారీ లక్ష్యాన్ని నిలిపిన ఇంగ్లాండ్.. ఇప్పటికే ఐదు వికెట్లు పడగొట్టింది. ఈ టెస్టులో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మ్యాచ్ ను కాపాడుకోవడం న్యూజిలాండ్ కు శక్తికి మించిన పనే. 

ఈ టెస్టులో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు 58.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులకే పరిమితమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 19 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని కలుపుకుని ఇంగ్లీష్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 374 పరుగులకు ఆలౌట్ అయింది.

ఫలితంగా కివీస్ ముందు 394 పరుగుల భారీ టార్గెట్ ను సెట్ చేసింది. అయితే నిలకడగా ఆడితే ఇదేం పెద్ద ఛేదించలేని లక్ష్యం కాదు. టెస్టు ముగియడానికి మరో రెండ్రోజుల టైమ్ కూడా ఉంది. కానీ కివీస్ మాత్రం తడబడింది. ఓపెనర్ టామ్ లాథమ్ (15), డెవాన్ కాన్వే (2) లు విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయిన కేన్ విలియమ్సన్.. ఈసారి మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు.

కివీస్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (1) కూడా ఈసారి నిలువలేదు. ఈ నాలుగు వికెట్లూ బ్రాడ్ ఖాతాలోనే పడ్డాయి. మిడిలార్డర్ బ్యాటర్ హెన్రీ నికోలస్ (7) ను రాబిన్సన్ ఔట్ చేశాడు. ఫలితంగా కివీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 63 పరుగులే చేసింది. 

Scroll to load tweet…

ఈ మ్యాచ్ లో గెలవాలంటే కివీస్ ఇంకా రెండు రోజుల ఆటలో 331 పరుగులు చేయాల్సి ఉంది. ఇటీవల భారత్ తో హైదరాబాద్ వన్డే లో భారీ స్కోరును ఛేదించే లక్ష్యంలో భారీ హిట్టింగ్ లతో భయపెట్టిన మిచెల్ బ్రాస్‌వెల్ (25 నాటౌట్) తో పా డారిల్ మిచెల్ (13 నాటౌట్) లు క్రీజులో ఉన్నారు. మరి నిప్పులు చెరుగుతున్న ఇంగ్లాండ్ బౌలర్లను తట్టుకుని ఈ ఇద్దరూ ఏమాత్రం నిలబడగలరు..? ఇంగ్లాండ్ విజయాన్ని ఎప్పటిదాకా అడ్డుకోగలరు..? అన్నది ఆదివారం తేలనుంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఇంగ్లాండ్ లంచ్ లోపే కివీస్ ను ఆలౌట్ చేసి పర్యాటక జట్టుకు షాక్ ఇచ్చే పనిలో ఉంది.