Novak Djokovic: ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆడించకపోయినా, ఫ్రెంచ్ ఓపెన్ లో నెగ్గకపోయినా పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడాడు సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్. వరుసగా నాలుగో వింబూల్డన్ ట్రోఫీ నెగ్గాడు.   

పచ్చిక కోర్టులపై తనకు ఎదురులేదని మరోసారి నిరూపించాడు నొవాక్ జొకోవిచ్. వింబూల్డన్ లో తనను ఢీకొట్టడం ఆషామాషీ వ్యవహారం కాదని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆదివారం సెంట్రల్ కోర్టులో జరిగిన వింబూల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నెంబర్ టూ జొకోవిచ్.. 4-6, 6-4, 7-6 (7/3) తో  అన్ సీడెడ్ అయిన  ప్రపంచ 40వ ర్యాంకర్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) పై విజయం సాధించాడు. మూడు గంటల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ కొదమసింహాల్లా పోరాడినా విజయం మాత్రం జొకోవిచ్ నే వరించింది. 

ఆనవాయితీని కొనసాగిస్తూ తొలి సెట్ ను కోల్పోయిన జొకోవిచ్.. మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. రెండు, మూడో సెట్లలో కిరియోస్ పుంజుకునేందుకు ప్రయత్నించినా జొకో మాత్రం అతడికి అవకాశం ఇవ్వలేదు. 

సుమారు 15వేల మంది ప్రేక్షకుల నడుమ సాగిన ఈ పోరులో చివరివరకు నువ్వానేనా అన్నట్టుగా సాగింది.  తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న కిరియోస్..  మ్యాచ్ మధ్యలో తన వ్యవహారశైలితో జొకోను రెచ్చగొట్టేందుకు యత్నం చేశాడు. కానీ పట్టుదల కోల్పోకుండా ఆడిన జొకో.. విజయంతోనే కిరియోస్ కు చెక్ పెట్టాడు. 

 

Scroll to load tweet…

వరుసగా నాలుగోది.. 

వింబూల్డన్ ను గెలవడం జొకోకు ఇది వరుసగా నాలుగో సారి. 2018, 19, 21 22 లలో టోర్నీ విజేత జొకోనే. 2020 లో కరోనా కారణంగా ఈ టోర్నీని నిర్వహించలేదు.  అదీగాక జొకోకు ఇది ఏడో వింబూల్డన్ టైటిల్. అంతకుముందు అతడు 2011, 2014, 2015లలో కూడా విజేతగా నిలిచాడు. వింబూల్డన్ తో పాటు జొకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను తొమ్మిదిసార్లు, ఫ్రెంచ్‌ ఓపెన్‌ను రెండుసార్లు, యూఎస్‌ ఓపెన్‌ను మూడుసార్లు గెలిచాడు.
  
మొత్తంగా 21.. సంప్రాస్ తో సమంగా..

తాజా గెలుపుతో జొకో.. తన కెరీర్ లో 21 వ టైటిల్ నెగ్గాడు. దీంతో అతడు  అమెరికా దిగ్గజ ఆటగాడు పీట్ సంప్రాస్ అత్యధిక వింబూల్డన్  టైటిళ్ల (7) రికార్డును సమం చేశాడు. ఇక ప్రపంచ టెన్నిస్ (పురుషుల) చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక గ్రాండ్ స్లామ్ లు గెలిచిన వారి జాబితాలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ (22) తర్వాత జొకో (21) తర్వాత స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ కు ముందు నాదల్, ఫెదరర్, జొకోవిచ్ లు 20 గ్రాండ్ స్లామ్ లతో సమానంగా ఉన్నారు. కానీ  ఆస్ట్రేలియా ఓపెన్ తో పాటు ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గడంతో నాదల్ 22 టైటిళ్లతో అగ్రస్థానానికి చేరాడు. 
 

Scroll to load tweet…

ప్రైజ్ మనీ 19 కోట్లు.. 

వింబూల్డన్ ఫైనల్ గెలిచిన జొకోకు 20 లక్షల బ్రిటిష్‌ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు), రన్నరప్‌ కిరియోస్‌కు 10 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్‌మనీగా దక్కాయి.