TATA IPL 2022: ఐపీఎల్ లో కావాల్సినంత స్టార్ డ్రమ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఇంతవరకూ ఆ జట్టు ఒక్కసారి కూడా ట్రోఫీ నెగ్గలేదు. మేటి ఆటగాళ్లు సారథులుగా చేసిన ఆ జట్టు.. ప్లే ఆఫ్ గండాలను దాటడం లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యంత పాపులారిటీ కలిగిన జట్లలో టక్కున గుర్తుకొచ్చే పేర్లలో ఫాఫ్ డుప్లిసిస్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. జట్టులో స్టార్ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన ఆల్ రౌండర్లు, ఏ క్షణంలో అయినా మ్యాచ్ గతిని మలుపుతిప్పే ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్ దాటితే మహాగొప్ప అనే స్థితిలో ఉంది. కాగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓ అమ్మాయి.. ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ నెగ్గేదాకా పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసింది. ఫ్లకార్డుపై అదే విషయం రాసుకుని వచ్చి.. స్టేడియంలో హంగామా చేసింది. మరి ఇలాంటివి ఎక్కడున్నా డేగ కళ్లతో పసిగట్టే మన ఐపీఎల్ కెమెరామెన్లు.. ఈ అమ్మాయిని ప్లకార్డును ప్రదర్శించి..వైరల్ చేసేశారు.
సీఎస్కే-ఆర్సీబీ మ్యాచ్ లో బెంగళూరు బ్యాటింగ్ చేస్తుండగా ఓ యువతి పోస్టర్ పై ‘నేను ఆర్సీబీ ఐపీఎల్ కప్ కొట్టేదాకా పెళ్లి చేసుకోను..’ అని రాసుకొని ప్లకార్డును ప్రదర్శించింది. కెమెరామెన్ల కన్ను ఈ అమ్మాయి వైపునకు మళ్లింది. ఇక మన నెటిజన్లు కామ్ గా ఉంటారా..? ఆమెను వైరల్ చేసేశారు.
ఇక అటూ తిరిగి ఇటు తిరిగి ఈ పోస్టర్ టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా దగ్గరకు చేరింది. ట్విట్టర్ వేదికగా అతడు ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘పాపం ఆ అమ్మాయి తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది..’ అని రాసుకొచ్చాడు. అంటే ఆర్సీబీ కప్ నెగ్గదని అమిత్ మిశ్రా కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడనేగా దాని అర్థం.
మిశ్రా ఏ ఉద్దేశంతో ఆ ట్వీట్ చేశాడో ఏమో గానీ పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘నువ్వు మంగమ్మ శపథాలు చేయకు తల్లీ... జాగ్రత్త.. జీవితాంతం సింగిల్ గానే ఉంటావ్..’, ‘నువ్వు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాల్సిందే పో అయితే...’, ‘ఇక నీకు పెళ్లి అవడం కష్టం..’ అంటూ కామెంట్లు పేలుతున్నాయి.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి బెంగళూరు ట్రోఫీ మీద ఆశలు పెట్టుకుంటూనే ఉంది. అయితే 2009, 2011, 2016 లో మాత్రమే ఆ జట్టు ఫైనల్ చేరింది. 2008, 2012, 2013, 2017, 2018, 2019లలో లీగ్ స్టేజ్ కే పరిమితమైంది. 2010, 2015, 2020, 2021 లలో ప్లే ఆఫ్స్ కు చేరింది. 2013 నుంచి గత సీజన్ వరకు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్న కోహ్లి.. ఇప్పుడు తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానాన్ని ఫాఫ్ డుప్లెసిస్ భర్తీ చేస్తున్నాడు.
కాగా మంగళవారం నాటి మ్యాచులో సీఎస్కే సూపర్ డూపర్ ఆటతో బెంగళూరుకు చుక్కలు చూపి సీజన్ లో తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు చేసింది. బదులుగా ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
