2020 ప్రపంచ కప్ పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఐసీసీ అధికారికంగా ప్రపంచ కప్ ని వాయిదా వేస్తుంది, ఆ ప్రకటన నేడు, రేపు అని అనేక సార్లు ఊహాగానాలు వచ్చినప్పటికీ... ఇప్పటివరకు దానిపై ఒక ఇప్పటివరకు ఒక నిర్దిష్ట ప్రకటన మాత్రం రాలేదు. 

ఇకపోతే... 2020 టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది సాధ్యపడదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మెన్‌, ఐసీసీ బోర్డు సభ్యుడు ఎహసాన్‌ మణి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్‌ అధ్యక్షుడు ఎడ్డింగ్స్‌ అభిప్రాయాలను మణి బలపరిచారు. రానున్న 3-4 వారాల్లో టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ నిర్ణయం వెలువడనుందని మణి తెలిపారు. 

ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ఇద్దరు సభ్యులు వరుసగా టీ20 వరల్డ్‌కప్‌ ఈ ఏడాది సాధ్యపడదని ప్రకటించటం గమనార్హం. ఐసీసీలో అత్యంత కీలక కమిటీ ఫైనాన్స్‌, కమర్షియల్‌ ఎఫైర్స్‌ కమిటీ (ఎఫ్‌సీఏ)కి‌ మణి చైర్మెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎర్ల్‌ ఎడ్డింగ్స్‌ ఎఫ్‌సీఏ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఐసీసీ టోర్నీలకు బడ్జెట్‌ కేటాయింపులు, టోర్నీల ద్వారా ఆదాయ ఆర్జన వంటి అంశాలను ఎఫ్‌సీఏ కమిటీ పర్యవేక్షిస్తుంది.

 "నా అభిప్రాయం ప్రకారం ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ సాధ్యపడదు. ప్రపంచకప్‌ను ఓ ఏడాది వాయిదా వేయటం అనివార్యం. ఐసీసీ షెడ్యూల్‌లో అందుకు అనుగుణమైన సమయం ఉంది. 2020, 2021, 2023లలో ఐసీసీ టోర్నీలు ఉన్నాయి. 

ఖాళీగా ఉన్న 2022 ఏడాదిలో ఈ షెడ్యూల్‌ను చేర్చవచ్చు. నిజానికి ఇప్పుడు చర్చలు ఈ దిశగానే సాగుతున్నాయి. ఏ టోర్నీ ఎప్పుడు జరగాలి, ముందు ఎక్కడ, తర్వాత ఎక్కడ అనే అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. 2021లో అక్టోబర్‌-నవంబర్‌ షెడ్యూల్‌లోనే ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ నిర్వహించటం క్రికెట్‌ మేలుచేస్తుంది. 

భారత్‌ 2022లో టీ20 వరల్డ్‌కప్‌, 2023లో వన్డే వరల్డ్‌కప్‌ నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతానికి 2021 టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ఆస్ట్రేలియాకు కేటాయించేందుకు ఐసీసీ మొగ్గు చూపెడుతోంది" అని మణి అన్నారు. 

2022 అక్టోబర్‌-నవంబర్‌లో టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇస్తే.. ఆరు నెలల వ్యవధిలోనే తిరిగి 2023 ఫిబ్రవరి-మార్చిలో వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉండాలి. ఆరు నెలల్లో రెండు వరల్డ్‌కప్‌లు నిర్వహించటం పట్ల బీసీసీఐ వైఖరి వెల్లడించాల్సి ఉంది.