మగవాళ్లు ఏడిస్తే తప్పేంటని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశ్నిస్తున్నారు. మగవాళ్లు ఏడ్చినంత మాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదనది ఆయన అన్నారు. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా సచిన్ బహిరంగ లేఖ రాశారు.

‘ కన్నీరు కారిస్తే తప్పేమీకాదు. నిన్ను బలవంతుడిని చేసే ఒక భాగాన్ని నువ్వు ఎందుకు దాచుకోవాలి? కన్నీళ్లు ఎందుకు దాచాలి? ఎందుకంటే అదే నిజమని నమ్ముతూ మనం పెరిగాం. ఏడుపు మగాళ్లను బలహీనులను చేస్తుందని నమ్మాం. అదే నిజమని నమ్ముతూ నేను కూడా పెరిగాను. కానీ అది తప్పని తెలుసుకున్నాను. అందుకే ఈ లేఖ రాస్తున్నాను. నా కష్టాలు, బాధలే నన్ను ఇలా తయారు చేశాయి. మెరుగైన వ్యక్తి గా మార్చాయి’ అంటూ సచిన్ లేఖలో పేర్కొన్నారు.

‘ మన బాధను అందరిముందు ప్రదర్శించడానికి ధైర్యం చాలా అవసరం. ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తున్నట్లే.. కష్టాల నుంచి శక్తిమంతులవుతాం. అందుకే ఇలాంటి అపోహల నుంచి బయట పడండి. భావోద్వేగాలు బయట పెట్టేందుకు ధైర్యం చేయండి. నేను ఆందోళన, బాధలు, సందేహాలను ఎదుర్కొన్నాను. ఏడుపొస్తే ఏడవడంలో తప్పులేదు. ఆ తర్వాత మనోధైర్యంతో ఉండాలి.’ అని సూచించారు.

‘ ఎందుకంటే మగాళ్లు చేయాల్సింది అదే. వీడ్కోలు సందేశం ఇచ్చేటప్పుడు నాకు ఏడుపొచ్చింది. ఆఖరిసారి ఔటై పెవిలియన్ ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు కుంగిపోతున్నట్లు అనిపించింది. గొంతు పూడుకుపోయింది. నా బుర్రలో ఏమేమో ఆలోచనలు వస్తున్నాయి. నాలో దాచుకోలేకపోయాను. వాటితో పోరాడలేకపోయాను. ఏదేమైనప్పటికీ నేను ప్రపంచం ముందుకు వెళ్లినప్పుడు ఆశ్చర్యంగా ప్రశాంతంగా అనిపించింది. నా కష్టానికి తగిన ఫలితం లభించినందుకు సంతోషంగా అనిపించింది.’ అని సచిన్ పేర్కొన్నారు.