Shane Warne Passes Away: షేన్ వార్న్ మరణానికి సంబంధించి అతడి అభిమానులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై థాయ్లాండ్ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం చెందాడని వార్తలు వస్తున్నా.. స్వయంగా అతడి మేనేజర్ కూడా అదే విషయం చెబుతున్నా అతడి అభిమానులకు మాత్రం మదిలో సందేహాలు మెదులుతూనే ఉన్నాయి. గతంలో ఇటువంటి పరిస్థితి ఎదుర్కోని వార్న్.. ఉన్నట్టుండి ఇలా ఆకస్మిక మరణానికి గురికావడంతో అతడి అభిమానులు.. వార్న్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ థాయ్లాండ్ పోలీసులు స్పందించారు. వార్న్ మరణానికి సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
వార్న్ మరణానంతరం థాయ్ పోలీసులు స్పందిస్తూ.. ఇందులో అనుమానించడానికేమీ లేదు. కార్డియాక్ అరెస్ట్ తోనే వార్న్ మరణించాడు. అతడిని బతికించడానికి వార్న్ స్నేహితులు ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు.
‘వార్న్ కొద్దిరోజులుగా తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయ్లాండ్ లోని కోహ్ సామూయ్ లో ఉన్న ఓ ప్రైవేట్ విల్లాలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో.. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి భోజనానికి రాకపోయేసరికి వారి ముగ్గురు స్నేహితులలో ఒక వ్యక్తి వార్న్ గదికి వెళ్లి చూశాడు. అప్పటికే అచేతనంగా పడి ఉన్న వార్న్ ను చూసి అతడు షాక్ కు గురయ్యాడు. హుటాహుటిన అతడి దగ్గరికి వెళ్లి వార్న్ ను బతికించడానికి ప్రయత్నించారు.
వార్న్ గుండెపై.. ఛాతి భాగంలో సుమారు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాలని చూశారు. అంతకుముందే అంబులెన్స్ కు పోన్ కూడా చేశారు. అంబులెన్స్ వచ్చేలోపు సీపీఆర్ ద్వారా అతడిని బతికించడానికి ప్రయత్నించారు. అయితే ఆస్పత్రికి తరలించిన తర్వాత వైద్యులు మళ్లీ అతడికి సీపీఆర్ నిర్వహించారు. అయినా ఫలితం లేకపోయింది...’అని థాయ్లాండ్ కు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
షేన్ వార్న్ తన కెరీర్ లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 8-71. ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ప్రదర్శన 37 సార్లు చేయగా.. మ్యాచులో పది వికెట్లు 10 సార్లు సాధించాడు. బౌలర్ గానే గాక బ్యాటర్ గా కూడా వార్న్ రాణించాడు. తన టెస్టు కెరీర్ లో 3,154 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 99. సెంచరీ చేయకుండా 3 వేలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్ వార్న్.
