వెల్లింగ్టన్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇక వికెట్లు తీయడం ఇంత సులభం కాకపోవచ్చు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ నేర్పిన పాఠం ప్రపంచంలోని ఇతర జట్ల బ్యాట్స్ మెన్ కూడా అనుసరించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ చెప్పాడు. బుమ్రా బౌలింగును ఎదుర్కోవడం కష్టమని న్యూజిలాండ్ జట్టు గుర్తించిందని ఆయన అన్నాడు. 

అందువల్లనే బుమ్రాను వదిలేసి మిగతా బౌలర్లను కేన్ విలియమ్సన్ సేన చితకబాదిందని ఆయన చెప్పాడు. న్యూజిలాండ్ పై జరిగిన మూడు వన్డేల సిరీస్ లో బుమ్రాకు ఒక్క వికెట్ కూడా దక్కకపోవడం తెలిసిందే. ఇదే విషయంపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. 

Also Read: అగ్రెసివ్ గా బంతులేయాలి, ప్రత్యర్థుల్లో వణుకు పుడుతుంది: బుమ్రాపై జహీర్ ఖాన్

బుమ్రా వంటి నాణ్యమైన బౌలర్ మీద కచ్చితంగా అంచనాలుంటాయని, అతడి బౌలింగును న్యూజిలాండ్ సమర్థంగా ఎదుర్కుందని, అతడిని ఎదుర్కోవడం కష్టమని కూడా గుర్తించిందని, అనుభవం లేని మిగతా బౌలర్లు ఉండడం వల్ల బుమ్రా బౌలింగును రక్షణాత్మకంగా ఆడారని షేన్ బాండ్ వివరించాడు. మిగతా అన్ని జట్లు కూడా ఇదే పద్ధతిని అనుసరించవచ్చునని ఆయన అన్నాడు.

అందువల్ల భారత్ విషయానికి వస్తే ఒక బృందంగా బౌలర్లు ప్రభావం చూపడం ఇప్పుడు అవసరమని, కివీస్ వికెట్లు ఫ్లాట్ గా ఉంటాయి కాబట్టి బౌలింగ్ చేయడం సులభం కాదని అన్నాడు, అయితే, బుమ్రా వన్డే సిరీస్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడని, పరుగులను ఆపగలిగాడని, కాని కొన్నిసార్లు వికెట్లు లభించవని ఆయన అన్నాడు. 

గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చినప్పుడు లైన్ లెంగ్త్ ను అందుకోవడం సులభం కాదని, కాస్తా సమయం పడుతుందని, టెస్టు సిరీస్ లో బుమ్రా కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని ఆయన అన్నాడు. న్యూజిలాండ్ పిచ్ లు స్పిన్ కు అనుకూలించవని అన్నాడు. తొలి రోజు బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగుకే మొగ్గు చూపుతుందని కూడా చెప్పాడు. 

Also Read: బుమ్రాను అంటారేమిటి, మరి కోహ్లీ సంగతేమిటి: ఆశిష్

కివీస్ అసలు స్నిన్నర్లనే ఆడించకపోవచ్చునని, ఆట సాగే కొద్ది పిచ్ లు ఫ్లాట్ గా మారుతాయని, సొంత గడ్డపై నీల్ వాగ్నర్ బౌన్సర్లను ఎదుర్కోవడం టీమిండియాకు సవాలేనని ఆయన అన్నాడు. టెస్టులకు పెద్ద మైదానాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రభావం ఎక్కువగా ఉంటుందని షే్ బాంగ్ చెప్పాడు.