ఇండియా-పాక్ మ్యాచ్.. జొమాటో-కరీమ్ పాకిస్తాన్ ట్విటర్ వార్
IND vs PAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ ను దాదాపు అన్ని కంపెనీలూ తమకు నచ్చినట్టుగా వాడుకుంటున్నాయి. తాజాగా భారత్ లో ఫుడ్ డెలివరీ చేసే జొమాటో.. పాకిస్తాన్ లో కూడా ఇదే తరహా యాప్ అయిన కరీమ్ పాకిస్తాన్ కూడా ట్విటర్ లో వాదులాడుకున్నాయి.
భారత్ - పాకిస్తాన్ కు ఉండే క్రేజ్ ను ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో భారత జట్టు లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో అఖండ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సాగుతున్నప్పుడు, ముగిసిన తర్వాత ఇండియా-పాక్ మ్యాచ్ క్రేజ్ ను స్టార్ స్పోర్ట్స్, డిస్నీ హాట్ స్టార్ మాదిరిగానే ఇతర కంపెనీలు కూడా తమకు నచ్చినట్టుగా వాడుకున్నాయి. కానీ భారత్, పాకిస్తాన్ లలో ఫుడ్ డెలివరీలో అగ్రగామిగా ఉన్న జొమాటో, కరీమ్ పాకిస్తాన్ మాత్రం ట్విటర్ వార్ కు దిగాయి. కౌంటర్ల మీద కౌంటర్లు వేసుకున్నాయి. కరీమ్ పాకిస్తాన్ అనేది ఫుడ్ డెలివరీలు మాత్రమే గాక రైడ్, హోం నీడ్స్ డెలివరీ సర్వీస్ కూడా అందిస్తున్నది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు జొమాటో దివాళీని ఉద్దేశించి ‘దీపాలు వెలగించారా..?’ అని ట్వీట్ చేసింది. దీనికి కరీమ్ పాకిస్తాన్ తన ట్విటర్ ఖాతాలో ఇదే ట్వీట్ ను రిట్వీట్ చేస్తూ..‘మీరు ప్రీ దివాళి గిఫ్ట్ (భారత్ ఓటమిని ఉద్దేశిస్తూ) కోసం సిద్ధంగా ఉన్నట్టున్నారు..’ అని వ్యంగ్యంగా స్పందించింది.
అయితే మ్యాచ్ ముగిసి భారత్ విజయం సాధించాక జొమాటో.. కరీమ్ పాకిస్తాన్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. ‘మీకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. మీకు స్వీట్లు కావాలా..? లేక మీ కడుపులను ఏడుపులు, ఓటములతో నింపేయడానికి సిద్ధమయ్యారా..?’ అని కౌంటర్ ఇచ్చింది.
కొద్దిసేపటికి జొమాటో మళ్లీ.. ‘డీయర్ పాకిస్తాన్... మీరు ఓటమిని ఆర్డర్ చేశారా..? దానిని తీసుకురావడానికి విరాట్ సిద్ధంగా ఉన్నాడు..’ అని మరో ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు కిందా మీద కాలిన కరీమ్ పాకిస్తాన్.. ‘మాకు చీట్ డేస్ లేవు..’ అని ట్వీట్ చేసింది. నిన్నటి మ్యాచ్ లో చివరి ఓవర్ లో నవాజ్ వేసిన హైట్ నోబాల్ వివాదం, నోబాల్ కు బైస్ వంటివాటిని పరోక్షంగా ఉద్దేశిస్తూ భారత్ ఈ మ్యాచ్ లో చీటింగ్ చేసి గెలిచిందని ట్వీట్ చేసింది.
అయితే ఈసారి జొమాటో స్పందించకున్నా టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం పాకిస్తాన్ యాప్ ను ఆటాడుకున్నారు. ‘మీరా చీటింగ్ గురించి మాట్లాడేది..?’ అని గతంలో పాకిస్తాన్ ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసేప్పుడు, బౌలింగ్ సమయంలో చేసిన చీటింగ్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ‘మాట్లాడేముందు ఇవి చూసి మాట్లాడండి కొంచెం. మీరు నీతులు చెబితే వినేంత దరిద్రమైన స్థితిలో మేం లేం..’ అని కౌంటర్ ఇస్తున్నారు.