చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి జరిమానా పడింది. అంపైర్లతో వాదనకు దిగిన కారణంగా అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. ఐపీఎల్‌లో భాగంగా గురువారం చెన్నై, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. స్టోక్స్ బౌలింగ్ చేశాడు.

తొలి బంతిని జడేజా సిక్సర్ కొట్టాడు. తర్వాత స్టోక్స్ నోబాల్ వేయగా.. జడేజా సింగిల్ తీశాడు. ఫ్రీహిట్‌కు ధోని రెండు పరుగులు తీశాడు. తర్వాతి బంతికి మహీ ఔటయ్యాడు. చివరి మూడు బంతుల్లో చెన్నై 8 పరుగులు చేయాల్సి రావడంతో ఉత్కంఠ పెరిగిపోయింది.

నాలుగో బంతిని స్టోక్స్... క్రీజులో ఉన్న శాంట్నర్‌కు నడుం పైకి వేశాడన్న కారణంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. రెండు పరుగులు వచ్చాయి. అయితే ఇక్కడే అంపైర్లు వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.

నోబాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ఈ నిర్ణయంపై జడేజా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగానే.. ధోని మైదానంలోకి దూసుకొచ్చాడు. అంపైర్లతో మహీ వాగ్వాదానికి దిగడంతో మ్యాచ్ కొద్దిసేపు నిలిచిపోయింది.

ఐదో బంతికి శాంట్నర్ రెండు పరుగులు తీశాడు. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి వుండగా స్టోక్స్ వైడ్ వేశాడు. స్టోక్స్ మళ్లీ బంతి వేయగానే శాంట్నర్ దానిని లాంగన్‌ దిశగా సిక్సర్ కొట్టి చెన్నైకి విజయాన్నందించాడు. నిబంధనలు ఉల్లంఘించిన అభియోగంపై మ్యాచ్ రిఫరీ ధోనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. అతని మ్యాచ్ ఫీజులో సగం కోత విధించారు.