Asianet News TeluguAsianet News Telugu

CWG 2022: కామన్వెల్త్ క్రికెట్‌లో కాంస్యం గెలిచిన న్యూజిలాండ్.. ఇంగ్లాండ్‌కు తప్పని ఓటమి

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ లో 24 ఏండ్ల తర్వాత ప్రవేశపెట్టిన క్రికెట్ పోటీలలో న్యూజిలాండ్ మహిళల జట్టు కాంస్య పతకం గెలిచింది. శనివారం భారత జట్టు చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌కు కాంస్యం పోరులోనూ ఓటమి తప్పలేదు. 

New Zealand Women Beats England Women Team by 8 wickets, Won Bronze medal
Author
India, First Published Aug 7, 2022, 6:06 PM IST

శనివారం భారత చేతిలో భంగపడ్డ  ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు..  కాంస్య పోరులో కూడా అదే రీతిలో ఓటమిపాలైంది. కామన్వెల్త్ గేమ్స్ -2022లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా ముగిసిన ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆతిథ్య జట్టుకు భంగపాటు తప్పలేదు. తొలుత ఇంగ్లాండ్ ను 110 పరుగులకే కట్టడి చేసిన న్యూజిలాండ్ అమ్మాయిలు.. ఆ తర్వాత లక్ష్యాన్ని 11.5 ఓవర్లలోనే ఛేదించి కాంస్యం సొంతం చేసుకున్నారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు తొలి నుంచీ షాక్ లు తగిలాయి. ఇంగ్లాండ్ ఓపెనర్లు వ్యాట్ (4),  డంక్లీ (8)లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ అలీస్ క్యాప్సీ (5) కూడా  విఫలమైంది. 

కెప్టెన్ సీవర్ (27), వికెట్ కీపర్ అమీ జోన్స్ (26) లు ఇంగ్లాండ్ ను ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ  న్యూజిలాండ్ బౌలర్లు వాళ్లకు ఆ అవకాశమివ్వలేదు. ఈ ఇద్దరూ నిష్క్రమించాక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో ఎక్లెస్టోన్ (18) మినహా  రెండంకెల స్కోరు చేసే వాళ్లు కూడా కరువయ్యారు. ఫలితంగా  ఇంగ్లాండ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో జేన్సన్ 3, ఫ్రాన్ జోన్స్, డెవిన్ లు రెండేసి వికెట్లతో చెలరేగారు. 

 

ఇక స్వల్ప లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్.. రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్, ఓపెనర్ అయిన  డెవిన్ (40 బంతుల్లో 51 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించింది. ఆమెకు తోడుగా సూజీ బేట్స్ (20), అమెలియా కెర్ (15 బంతుల్లో 21 నాటౌట్, 3 ఫోర్లు)  ధాటిగా ఆడారు. దీంతో కివీస్.. 11.5 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది. 

ఈ విజయంతో  కివీస్ మహిళల జట్టు కాంస్యం గెలుచుకుంది. 8 జట్లు పాల్గొన్న  ఈ పోటీలలో  ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక  స్వర్ణం కోసం ఆస్ట్రేలియా-ఇండియా లు నేటి రాత్రి 9.30 గంటలకు తలపడనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య  జరిగిన టోర్నీ తొలి మ్యాచ్ లో ఆసీస్ నే విజయం వరించింది. మరి నేటి  మ్యాచ్ లో గెలిచేది ఎవరో..? విజేతగా నిలిచేది ఎవరో కొన్ని గంటల్లో తేలనుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios