Asianet News TeluguAsianet News Telugu

పుజారా ఇంటర్వ్యూ: 39 ఏళ్ల క్రితం ఇక్కడే అంటూ రవిశాస్త్రి...

39 ఏళ్ల క్రితం తాను అదే ఫిబ్రవరి 21వ తేదీన వెల్లింగ్టన్ మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన జ్ఞాపకాలను టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఛతేశ్వర్ పుజారాతో పంచుకున్నాడు.

New Zealand vs India: Ravi Shastri Recalls Test Debut At Wellington 39 Years Ago
Author
Wellington, First Published Feb 20, 2020, 3:40 PM IST

వెల్లింగ్టన్: న్యూజిలాండ్, భారత్ మధ్య శుక్రవారం వెల్లింగ్టన్ లోని బేసిన్ రిజర్వ్ లో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. యాదృచ్ఛికంగా 1981లో ఇదే రోజు ఇదే వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ద్వారానే టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగేట్రం చేశాడు. 

రవిశాస్త్రిని టీమిండియా ఆటగాడు ఛతేశ్వర పుజారా ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూ వీడియోని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విట్టర్ లో పోస్టు చేసింది. 39 ఏళ్ల క్రితంనాటి తన జ్ఞాపకాలను రవిశాస్త్రి పుజారాతో పంచుకున్నాడు. 

అదే వేదిక, అదే మైదానం, అదే ప్రత్యర్థి.. ఇదే వేదికకు తాను మళ్లీ వస్తానని అనుకోలేదని రవిశాస్త్రి చెప్పాడు. తాను డ్రెసింగ్ రూంకు వెళ్లి చూశానని, అదే డ్రెసింగ్ రూం అని ఆయన అన్నారు. 39 ఏళ్ల క్రితం తాను ఇక్కడే తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించినట్లు తెలిపాడు. తాను నమ్మలేకపోతున్నానని, ఆ రోజు కూడా ఫిబ్రవరి 21వ తేదీనే అని ఆయన అన్నాడు. 

మ్యాచ్ కు ముందు రోజు న్యూజిలాండ్ కు ఎలా వచ్చారని పుజారా అడిగితే.. తాను నేరుగా హోటల్ కు వెల్లానని, మర్నాడు ఉదయం ఆట కోసం మైదానానికి వచ్చానని రవిశాస్త్రి చెప్పాడు. దాన్ని తాను మరిచిపోలేనని రవిశాస్త్రి అన్నాడు. విమానాశ్రయానికి తన కోసం స్వర్గీయ బాపూ నాడ్కర్ణి వచ్చారని, భారత జట్టు హై కమిషన్ ఆఫీసులో ఉందని చెప్పాడు. 

తాను నేరుగా హోటల్ కు వెళ్లానని, తన రూమ్మేట్ దీలీప్ వెంగ్ సర్కార్ అని, అయితే గదిలో ఎవరూ లేరని, మర్నాడు తాను మైదానానికి వెళ్లానని, కెప్టెన్ సునీల్ గవాస్కర్ టాస్ ఓడిపోయాడని, తాము ఫీల్డింగ్ కు దిగాల్సి వచ్చిందని, నేరుగా ఆటలోకి దిగాల్సిన పరిస్థితి తనకు ఏర్పడిందని ఆయన అన్నారు. 

రవిశాస్త్రి ఆ మ్యాచులో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రెండు ఇన్నింగ్సుల్లో కలిపి ఆరు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచును భారత్ 62 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాను నెర్వస్ లో ఉన్నానని అనుకుంటా అని, తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా నెర్వస్ ఫీలవుతారని, తాను చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశానని, తాను జెరేమీ కోనీ వికెట్ తీశానని, దాంతో విశ్వాసం పెరిగిందని అన్నాడు. 

 

ఇండియాలో కన్నా ఇక్కడ పరిస్థితులు పూర్తి భన్నంగా ఉంటాయని, ప్రపంచంలోని ఇతర దేశాల్లో కన్నా ఇక్కడ భన్నంగా ఉంటాయని, గాలులు వీస్తుంటాయని, ఆ రోజు చాలా చలిగా ఉందని అన్నాడు. తనకు స్వెటర్ ఇచ్చిన పాలీ ఉమ్రిగర్ కు ఆయన థ్యాంక్స్ చెప్పాడు. తనకు స్వెట్టర్ లేకపోవడంతో ఉమ్రిగర్ తన స్వెట్టర్ ఇచ్చాడని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios