క్రైస్ట్ చర్చ్: తమ టీమిండియా బ్యాటింగ్ తీరుపై తెలుగు క్రికెటర్ హనుమ విహారి స్పందించాడు. చెత్త షాట్ల కారణంగానే తమ జట్టు త్వరగా అవుటైందని ఆయన అన్నాడు. పిచ్ అంత ప్రమాదకరంగా ఏమీ లేదని, కీలకమైన దశల్లో వికెట్లు ఇవ్వడం వల్ల న్యూజిలాండ్ ఆధిపత్యం సాధించిందని ఆయన అన్నాడు. భారత్ తొలి ఇన్నింగ్సు 242 పరుగుల వద్ద ముగిసిన విషయం తెలిసిందే. విహారి 79 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 

పిచ్ ఊహించినంత ప్రమాదకరంగా ఏమీ లేదని, న్యూజిలాండ్ బౌలర్లు చక్కని ప్రాంతాల్లో బంతులు వేశారని, ఆ ట్రాక్ లో ఏం ఆశించాలో వారికి తెలుసునని, పృథ్వీ షా శుభారంభం అందించాడని హనుమ అన్నాడు. పుజారా చాలా సమయం క్రీజులో ఉన్నాడని, కానీ అందరూ ఔటైన సమయమే సరైంది కాదని, పిచ్ వల్ల ఔట్ కాలేదని, బ్యాట్స్ మెన్ తప్పిదాల వల్లనే అవుటయ్యారని ఆయన అన్నాడు.

Also Read: షమీ తడాఖా: ఎట్టకేలకు కివీస్ ను భయపెట్టిన భారత బౌలర్లు

పుజారా ఒక ఎండ్ లో నిలబడ్డాడు కాబట్టి తాను మరో ఎండ్ లో దూకుడుగా ఆడాలని అనుకున్నట్లు ఆయన తెలిపాడు. పుజారా కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడని, అందువల్ల అతనిపై ఒత్తిడి ఉండకూడదనే ఉద్దేశంతో తాను దూకుడుగా ఆడానని, పేసర్లను సానుకూల దృష్టితో ఎదుర్కున్నానని చెప్పాడు. 

సెషన్ మొత్తం బాగా ఆడి తేనేటీ విరామం ముందు తాను ఔట్ కావడం సరైంది కాదని, అంతకు ముందు 110 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయామని ఆయన చెప్పాడు.

Also Read: రిషబ్ పంత్ మరో చెత్త ప్రదర్శన: సెటైర్లు వేస్తున్న నెటిజన్లు

షార్ట్ పిచ్ బంతులను ఆడాలనేది తన నిర్ణయమేమని హనుమ చెప్పాడు. ఒక జట్టుగా తాము మరింత తీవ్రత చూపించాలని అనుకున్నామవని, బేసిన్ రిజర్వ్ కన్నా ఈ పిచ్ బాగుందని, షార్ట్ పిచ్ బంతులను ఆడి బౌలర్లపై ఒత్తిడి పెంచాలని అనుకున్నానని ఆయన చెప్పాడు.

భారత్ ఏ జట్టు తరఫున తాను ఇక్కడ ఆడానని, తొలి సెషన్ తర్వాత పిచ్ ప్రమాదకరంగా ఉండదని తాను చెప్పానని, మూడు రోజుల తర్వాత మందకొడిగా మారుతుందని ఆయన అన్నారు. జెమీసన్ అదనపు బౌన్స్ ను రాబడుతున్నాడని, అందువల్లే ఐదు వికెట్లు సాధించాడని అన్నాడు.