టీమిండియా మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను న్యూజిలాండ్ బౌలర్ వెనక్కినెట్టాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ లో  పేసర్ టిమ్ సౌథీ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ లో సౌథీ కేవలం ఒకే ఒక సిక్సర్ బాది సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. 

సచిన్ తన కెరీర్లో 200 టెస్ట్ మ్యాచులాడగా 329 ఇన్నింగ్సుల్లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. ఇలా అతడు కేవలం టెస్ట్ క్రికెట్లోనే 15921 పరుగులను పూర్తిచేసుకున్నాడు. అయితే సహజంగానే బారీ షాట్లు ఆడేందుకు ఇష్టపడని సచిన్ తన టెస్ట్ కెరీర్ మొత్తంలో కేవలం 69 సిక్సర్లు మాత్రమే బాదాడు. అయినా కూడా టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అతడు 17వ స్థానంలో నిలిచాడు. తాజాగా ఆ స్థానాన్ని సౌథీ కైవసం చేసుకున్నాడు. 

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో సౌథీ 19 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతడు ఓ భారీ సిక్సర్ బాదాడు. దీంతో అతడి ఖాతాలోకి 69వ సిక్సర్ చేరింది. ఇలా సచిన్ సరసకు చేరిన సౌథీ అరుదైన ఘనతను సాధించాడు. 

 టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండమ్ మెక్ కల్లమ్(107 సిక్సర్లతో) మొదటి స్థానంలో వున్నాడు. అతడి తర్వాతి స్థానంలో ఆసిస్ ఆటగాడు గిల్ క్రిస్ట్(100 సిక్సర్లతో)  నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర వీరేంద్ర సెహ్వాగ్ 91 సిక్సర్లలో ఐదో స్థానంలో  నిలిచాడు.

శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో కివీస్ మొదటి రోజును 203/5 వద్ద ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్‌ కేవలం 46 పరుగులు మాత్రమే జోడించి 249 పరుగుల వద్ద మొదట ఇన్నింగ్స్ ముగించింది.  ఆ తర్వాత శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో 267 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం కివీస్ రెండో ఇన్నింగ్స్  కొనసాగిస్తోంది.