Asianet News TeluguAsianet News Telugu

చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న న్యూజిలాండ్.. లింగ బేధం లేదు.. ఇక నుంచి సమాన వేతనం..

New Zealand: ప్రపంచ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. పురుషులు, మహిళల మధ్య వేతన వ్యత్యాసాలను బోర్డు చెరిపేసింది. 

New Zealand cricket Takes Historical Decision, Women Cricketers Get Equal Pay as Men's Team
Author
India, First Published Jul 5, 2022, 12:47 PM IST

ఇది చారిత్రాత్మకం. న్యూజిలాండ్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ లో పెను సంచలనానికి దారితీసింది. ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా  ఒక బోర్డు పురుష క్రికెటర్లతో పాటుగా మహిళా క్రికెటర్లకు కూడా సమాన వేతనాలు చెల్లించనుంది.  ఈ మేరకు ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కివీస్ జాతీయ జట్టుకు ఆడే మెన్ అండ్ విమెన్ క్రికెటర్లతో పాటు దేశవాళీలో ఆడే ఆటగాళ్లకు కూడా ఇదే నిబంధన వర్తించనుంది.  టీ20లు, వన్డేలు, టెస్టులు, ఫోర్డ్ ట్రోఫీ, సూపర్ స్మాష్ లెవల్ తో పాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లందరికీ లింగ బేధం లేకుండా సమాన వేతనాలు ఇవ్వాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. 

కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే న్యూజిలాండ్ లో మహిళా క్రికెట్ కు మరింత మంచికాలం వచ్చినట్టే లెక్క.  అదీగాక ఇప్పుడున్న మహిళా క్రికెటర్ల కాంట్రాక్టులకు మరికొన్నింటిని కూడా పెంచింది ఆ దేశ బోర్డు. ఈ నిర్ణయాన్ని న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ గేమ్ ఛేంజర్ గా అభివర్ణించింది. 

ఈ నిర్ణయం వెలువడిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘పురుష, మహిళ క్రికెటర్లకు సమాన వేతనాలు కల్పించడమనే నిర్ణయం చారిత్రాత్మకం. దీని ద్వారా విమెన్ క్రికెటర్లకు కూడా గుర్తింపు దక్కుతుంది.  దేశంలో క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకునే యువతులకు ఇది చాలా మంచి అవకాశం. తద్వారా చాలా మంది క్రికెట్ ను కెరీర్ గా మలుచుకుంటారు.. ’ అని  తెలిపింది. 

 

ఇదే విషయమై పురుషుల జట్టు సారథి కేన్ విలియమ్సన్ కూడా హర్షం వ్యక్తం చేశాడు. కేన్ మామ స్పందిస్తూ.. ‘ప్రస్తుత ఆటగాళ్లు మనకంటే ముందు ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగించడం.. రేపటి తరం ఆటగాళ్లకు అన్ని స్థాయిలలో మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం దానిని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది..’ అని తెలిపాడు. 

తాజా ఒప్పందం రాబోయే ఐదేండ్ల పాటు అమల్లో ఉంటుంది. కొత్త ఒప్పందం ప్రకారం..  న్యూజిలాండ్ లో డొమెస్టిక్ కాంట్రాక్టుల సంఖ్య 54 నుంచి 72 కు పెరగనుంది. దేశవాళీలో మహిళల వార్షిక కాంట్రాక్టుల సంఖ్య కూడా 9 నుంచి 12కు  పెంచారు. ఇదిలాఉండగా కివీస్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇతర దేశాల బోర్డులు కూడా ఈ దిశగా ముందడుగు వేసే అవకాశాలున్నాయి. అదే జరిగితే పురుషుల క్రికెట్ మాదిరే మహిళా క్రికెట్ కు కూడా ఆదరణ పెరగడం ఖాయం. అదీగాక  ఎక్కువ మంది అమ్మాయిలు క్రికెట్ ను కెరీర్ గా మలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios