వెల్లింగ్టన్: అతి ప్రవర్తించి, నిబంధనలను ఉల్లంఘిస్తే క్రికెటర్లపై నిషేధం విధించడం పరిపాటి. అయితే, ఓ క్రికెట్ అభిమాని నిషేధానికి గురయ్యాడు. ఓ క్రికెట్ అభిమానిపై న్యూజిలాండ్ క్రికెట్ రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అతను న్యూజిలాండ్ కు చెందిన క్రికెట్ అభిమాని. 

ఇంగ్లాండు క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ మీద ఓ క్రికెట్ అభిమాని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఆయనను దూషించాడు. నిరుడు నవంబర్ లో న్యూజిలాండ్, ఇంగ్లాండు మధ్య జరిగిన తొలి టెస్టు చివరి రోజు ఆటలో ఆర్చర్ పై ఆక్లాండ్ కు చెందిన ఓ క్రికెట్ అభిమాని జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు.

దాంతో ఆగకుండా ఆర్చర్ ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేశాడు. దానిపై అప్పట్లో పెద్ద దుమారమే చెలరేగింది. దాంతో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అతన్ని పట్టుకునే పనిలో పడింది. అతన్ని 28ఏళ్ల వయస్సుగల వ్యక్తిగా గుర్తించారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. 

దానికితోడు రెండేళ్ల పాటు క్రికెట్ వీక్షించడానికి మైదానాలకు రాకుండా అతనిపై రెండేళ్ల పాటు నిషేధం విధించారు. 2022 వరకు అతనిపై నిషేధం ఉంటుందని న్యూజిలాండ్ క్రికెట్ ప్రతినిది ఆంటోనీ క్రుమ్మీ చెప్పాడు. 

న్యూజిలాండ్ లో జరిగే జాతీయ, అంతర్జాతీయ మ్యాచులకు అతన్ని అనుమతించరు. నిషేధ కాలంలో అతను మ్యాచులు చూడడానికి ప్రయత్నిస్తే చర్యలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.