Asianet News TeluguAsianet News Telugu

స్వదేశంలో పాకిస్తాన్‌కు మరో పరాభవం.. బాబర్ పదవికి ఎసరు..!

PAKvsNZ:ఆస్ట్రేలియాపై టెస్టు,టీ20 సిరీస్ కోల్పోయిన  తర్వాత 2022 చివర్లో  తమ దేశానికి వచ్చిన ఇంగ్లాండ్ చేతిలో కూడా పాకిస్తాన్ వైట్ వాష్ అయింది. అంతకుముందే జరిగిన టీ20 సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ దే విజయం.

New Zealand Beat Pakistan by 2 Wickets and Clinch The Series by 2-1
Author
First Published Jan 14, 2023, 11:51 AM IST

స్వదేశంలో పాకిస్తాన్ కు మరో పరాభవం తప్పలేదు. గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టు, వన్డే సిరీస్ కోల్పోయిన  తర్వాత 2022 చివర్లో  తమ దేశానికి వచ్చిన ఇంగ్లాండ్ చేతిలో కూడా పాకిస్తాన్ వైట్ వాష్ అయింది. రావల్పిండి, కరాచీ, ముల్తాన్ టెస్టులలో  పాక్ కు  ఘోర ఓటమి ఎదురైంది. అంతకుముందే జరిగిన టీ20 సిరీస్ లో కూడా ఇంగ్లాండ్ దే విజయం. తర్వాత న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో కూడా చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా  సిరీస్ ను డ్రా చేసుకుంది.  కానీ మళ్లీ వన్డే సిరీస్ లలో  ఆ  జట్టుకు ఓటమి తప్పలేదు. 

శుక్రవారం  కరాచీ వేదికగా ముగిసిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన  పాకిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది.  పాక్ జట్టులో ఓపెనర్ ఫకర్ జమాన్ (122 బంతుల్లో 101, 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీతో మెరిశాడు.  వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (74 బంతుల్లో 77, 6 ఫోర్లు) , అగా సల్మాన్ (45) రాణించారు.   

ఓపెనర్ షాన్ మసూద్ (0) విఫలమవగా  కెప్టెన్ బాబర్ ఆజమ్.. 4 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.  హరీస్ సొహైల్  (22), మహ్మద్ నవాజ్ (8) విఫలమయ్యారు.  కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ  మూడు వికెట్లు తీయగా  లాకీ ఫెర్గూసన్ కు రెండు వికెట్లు దక్కాయి. 

అనంతరం బ్యాటింగ్ చేసిన కివీస్.. 48.1 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే (52), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (53) అర్థ సెంచరీలతో రాణించగా చివర్లలో   గ్లెన్ ఫిలిప్స్.. 42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేసి  నాటౌట్ గా నిలవడమే గాక జట్టుకు విజయాన్ని అందించాడు.  ఫలితంగా   సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది. తొలి వన్డేలో నెగ్గిన పాక్.. తర్వాత రెండు వన్డేలలో తేలిపోయింది.  కివీస్ కు పాకిస్తాన్ లో ఇదే తొలి వన్డే సిరీస్ విజయం కావడం గమనార్హం. 

ఇప్పటికే స్వదేశంలో వరుస సిరీస్ లలో ఓటమితో పాటు బ్యాటింగ్ లో కూడా అంత గొప్పగా రాణించలేకపోతున్న  పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఈ సిరీస్ వైఫల్యంతో  సారథ్య పదవికి గండం  పొంచి ఉంది.  పలు రిపోర్టుల ప్రకారం బాబర్ ను తొలగించి.. టెస్టు,  వన్డే సారథ్య బాధ్యతలు షాన్ మసూద్ కు అప్పజెప్పనున్నారని సమాచారం. అది  న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ ఓటమి నేపథ్యంలో వాటికి బలం చేకూరింది.  

 

పాకిస్తాన్ పర్యటన ముగిసిన నేపథ్యంలో కివీస్ జట్టు అక్కడ్నుంచి నేరుగా భారత్ కు రానుంది. ఇక్కడ భారత్ తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.  తొలి వన్డే 18 న  హైదరాబాద్ లోని ఉప్పల్  స్టేడియం వేదికగా జరుగనుంది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios