అనుకున్నట్టే రీఎంట్రీ ఇచ్చిన కేన్ విలియంసన్.. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి న్యూజిలాండ్ జట్టు ఇదే..
ఐపీఎల్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో గాయపడిన కేన్ విలియంసన్.. వన్డే వరల్డ్ కప్ 2023 ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్న న్యూజిలాండ్ కెప్టెన్..
ఐపీఎల్ 2023 సీజన్ మొదటి మ్యాచ్‌లో గాయపడి నాలుగు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న కేన్ విలియంసన్, అనుకున్నట్టుగానే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున ఆడిన కేన్ విలియంసన్, మొదటి మ్యాచ్‌లో బౌండరీ లైన్ దగ్గర క్యాచ్‌కి ట్రై చేసి బిల్ బోర్డు మీద పడిపోయాడు..
గాయం కారణంగా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన కేన్ విలియంసన్, ఊత కర్రల సాయంతో స్వదేశానికి తిరిగి వెళ్లాడు. ఈ గాయం కారణంగా కేన్ విలియంసన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడడం కూడా కష్టమే అనుకున్నారు చాలామంది క్రికెట్ ఫ్యాన్స్..
అయితే ఊహించనిదాని కంటే వేగంగా కోలుకున్న కేన్ విలియంసన్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తాజాగా ప్రపంచ కప్ 2023 టోర్నీ జట్టుకి కేన్ విలియంసన్‌ని కెప్టెన్‌గా ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు..
2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిన న్యూజిలాండ్, 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో సూపర్ ఓవర్‌లో ఓడింది. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఎక్కువ బౌండరీలు బాదిన ఇంగ్లాండ్‌ని వరల్డ్ కప్ విజేతగా ప్రకటించారు అంపైర్లు. ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది..
వరుసగా రెండు సార్లు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన న్యూజిలాండ్, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. అయితే భారత్‌లో న్యూజిలాండ్‌కి చెప్పుకోదగ్గ రికార్డు లేదు. స్పిన్ పిచ్‌ల మీద పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడే న్యూజిలాండ్, ఈసారి ఐసీసీ టోర్నీలో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..
కేన్ విలియంసన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, లూకీ ఫర్గూసన్, జేమ్స్ నీశమ్, టిమ్ సౌథీ, ఇష్ సోదీ, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్ వంటి 2019 వన్డే వరల్డ్ కప్ ఆడిన ప్లేయర్లు, 2023 వన్డే వరల్డ్ కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నారు.
అయితే న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న సీనియర్లు మార్టిన్ గప్తిల్, కోలిన్ డి గ్రాండ్‌హోమ్ వంటి సీనియర్ బ్యాటర్లకు న్యూజిలాండ్ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కలేదు.
న్యూజిలాండ్ జట్టు ఇది: కేన్ విలియంసన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డివాన్ కాన్వే, లూకీ ఫర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డార్ల్ మిచెల్, జేమ్స్ నీశమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోదీ, టిమ్ సౌథీ, విల్ యంగ్
2019 వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో అక్టోబర్ 9న నెదర్లాండ్స్‌తో, అక్టోబర్ 13న చెన్నైలో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 18న ఆఫ్ఘాన్‌తో మ్యాచులు ఆడుతుంది న్యూజిలాండ్..
అక్టోబర్ 22న ధర్మశాలలో ఇండియా - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడిపోతూ వస్తోంది భారత జట్టు. ఈ మ్యాచ్‌కి మంచి క్రేజ్ ఏర్పడింది.