TATA IPL 2022 GT vs SRH: హైదరాబాద్ నయా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే భారత జట్టుకు ఆడితే చూడాలని ఉంది అని చాలా మంది అభిమానులతో  పాటు దిగ్గజాలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తనను ఎందుకు జాతీయ జట్టులో  స్థానం కల్పించాలో ఉమ్రాన్ రాను రాను స్పష్టంగా అర్థం చేయిస్తున్నాడు. 

ఉమ్రాన్ మాలిక్.. ఐపీఎల్ ప్రారంభమై సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచులు ఆడటం ప్రారంభించినప్పట్నుంచి ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులు మాట్లాడుకున్నా వినిపిస్తున్న పేరు. ఈ కశ్మీరి కుర్రాడిని భారత జట్టులో చూడాలని వాళ్లతో పాటు దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి ఎందరో ఆశిస్తున్నారు. ఉమ్రాన్ ను అంతలా ఆకాశానికెత్తడానికి ఏముంది..? పేస్ ఒక్కటే సరిపోతుందా..? భారీగా పరుగులిస్తున్నాడు కదా..? అన్న వాళ్లూ ఉన్నారు. ప్రశంసలను పదిలంగా దాచుకుంటున్న ఈ 22 ఏండ్ల కాశ్మీరి కుర్రాడు.. విమర్శకులకు మాత్రం తనను ఎందుకు జట్టులో తీసుకోవాలో స్పష్టంగా అర్థం చేయిస్తున్నాడు. ఎంత స్పష్టంగా అంటే.. 152 కిలోమీటర్ల వేగంతో బంతి విసిరితే అదొచ్చి నేరుగా మిడిల్ స్టంప్ ను ఎగురగొట్టేంతగా...

బుల్లెట్ వేగంతో దూసుకొచ్చే బంతులు. బ్యాట్ అడ్డం పెడితేనే ఓకే గానీ క్రీజులో ఉన్న బ్యాటర్ కర్మ కాలి బంతిని మిస్ చేశాడా..? ఇక అంతే సంగతులు. మిడిల్, ఆఫ్ స్టంప్స్ లో ఏదో ఒకటి ఎగరడమే తరువాయి. అతడి బౌలింగ్ లో గొప్ప షాట్లు ఆడకపోయినా ఫర్వాలేదు. కనీసం బ్యాట్ అడ్డం పెట్టినా చాలు.. అది బౌండరీ లైన్ కు వెళ్తుందని బ్యాటర్లు ఓ ప్రాథమిక నిర్ధారణకు వచ్చారంటే అతడి బౌలింగ్ విధ్వంసం ఎలా సాగుతుందో అర్థం చేేసుకోవచ్చు.

అప్పుడొచ్చాడు.. 

గతేడాది ఎస్ఆర్హెచ్ బౌలర్ నటరాజన్ గాయపడటంతో నెట్ బౌలర్ గా ఉన్న ఉమ్రాన్.. ఆ సీజన్ లో పలు మ్యాచులు ఆడాడు. అతడి ప్రతిభ గుర్తించిన సన్ రైజర్స్ ఈసారి రిటెన్షన్ లో రూ. 4 కోట్లు పెట్టి దక్కించుకుంది. తనమీద నమ్మకముంచిన యాజమాన్యం ఆశలను ఉమ్రాన్ వమ్ము చేయలేదు. 

ఈ సీజన్ లో తొలుత మూడు మ్యాచులు వరకు గతి తప్పిన బంతులతో భారీగా పరుగులిచ్చుకున్న ఉమ్రాన్.. తర్వాత గాడిలో పడ్డాడు. రాజస్తాన్ రాయల్స్ మ్యాచ్ తో 2 వికెట్లు తీశాడు. కానీ 39 పరుగులిచ్చాడు. ఆ తర్వాత లక్నో, చెన్నై తో వికెట్లు తీయలేదు. కానీ ధారాళంగా పరుగులొచ్చాయి. గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో (1 వికెట్ 39 రన్స్) కూడా అదే ప్రదర్శన. దీంతో ఫాస్టెస్ట్ డెలివరీ చెక్ (రూ. 1 లక్ష) కోసమే ఆడుతున్నావా...? అని విమర్శలు. 

అదరగొడుతున్నాడు..

కానీ కేకేఆర్ తో మ్యాచ్ నుంచి ఉమ్రాన్ స్టైల్ మార్చాడు. తన అమ్ములపొదిలో ప్రధాన ఆయుధమైన పేస్ ను నమ్ముకుని లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరాడు. అప్పుడు పరుగులు తగ్గాయి. వికెట్లు పెరిగాయి. కేకేఆర్ తో శ్రేయస్ అయ్యర్ ను బౌల్డ్ చేసిన యార్కర్ అయితే ఈ సీజన్ లోనే హైలైట్. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో 4 వికెట్లు తీసి 28 పరుగులే ఇచ్చాడు. ఇక బుధవారం గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో ఏకంగా 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ లో గుజరాత్ కోల్పోయిన వికెట్లన్నీ తీసింది ఉమ్రానే కావడం గమనార్హం. అదీగాక ఒక్క హార్ధిక్ పాండ్యా తప్ప శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్ అంతా క్లీన్ బౌల్డ్ అయ్యారు. 

Scroll to load tweet…

ఆప్షన్ లేదిక.. 

ప్రస్తుతం ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు (చాహల్ 18 వికెట్లు) తీసిన జాబితాలో ఉమ్రాన్ రెండో స్థానం (15 వికెట్లు) లో ఉన్నాడు. అయితే త్వరలోనే భారత జట్టు స్వదేశంలో దక్షిణాఫ్రికా తో 5 మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కు ఉమ్రాన్ కు అవకాశం కల్సించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. నానాటికీ రాటుదేలుతున్న ఉమ్రాన్ వంటి పేసర్ టీమిండియాకు దొరకడం వరం వంటిదని అతడిని ఐపీఎల్ కే పరిమితం చేయొద్దని వ్యాఖ్యానిస్తున్నారు. 

భారత్ కు గతంలో పేసర్లు ఉన్నా ఈ స్థాయి వేగంతో బంతులు విసరగలిగే బౌలర్ లేడని స్వయంగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కితాబిచ్చిన తర్వాత బీసీసీఐ అతడిని ఆడించకపోవడం అవివేకమే అవుతుంది. అదీగాక ఈ ఏడాది అక్టోబర్ లో ఆస్ట్రేలియా లో టీ20 ప్రపంచకప్ జరుగనుంది. సాధారణంగా ఆస్ట్రేలియాలో పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు స్వర్గధామం. ఈ నేపథ్యంలో ఉమ్రాన్ అక్కడ తప్పకుండా రాణిస్తాడని క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.