Asianet News TeluguAsianet News Telugu

క్రికెట్లో నయా ఫార్మాట్: ఒకేవేదికపై ఒకేసారి మూడు టీమ్స్, జూన్ 27న తొలి మ్యాచ్

ఏమిటి ఈ 3టిసిఎం మ్యాచ్ అనుకుంటున్నారా..? ఒకేవేదికపై ఒకేసారి మూడు టీంలు క్రికెట్ ఆడటం. జూన్‌ 27న ఒకే మ్యాచ్‌లో మూడు జట్లు పోటీపడబోతున్నాయి. ఇదేమీ అచ్చుతప్పు కాదు, మీరు చదివింది నిజమే. ఒక మ్యాచ్‌లో మూడు జట్లు పోటీపడబోతున్నాయి.

New Format In Cricket: 3 Team Cricket match, First Match On June 27
Author
Hyderabad, First Published Jun 18, 2020, 4:23 PM IST

ఇప్పటివరకు అందరూ టెస్టు, వన్డే, టి20, తాజాగా టి10 మ్యాచులను కూడా చూస్తున్నాము. ఓవర్లు ఎన్నైనా... పోటీ పడేది రెండు జట్లే, జట్టుకు 11 మందే...! కానీ ఇప్పుడు యావత్ క్రికెట్ ప్రపంచంలో 3టిసిఎం మ్యాచ్ చర్చనీయాంశమయింది. 

ఏమిటి ఈ 3టిసిఎం మ్యాచ్ అనుకుంటున్నారా..? ఒకేవేదికపై ఒకేసారి మూడు టీంలు క్రికెట్ ఆడటం. జూన్‌ 27న ఒకే మ్యాచ్‌లో మూడు జట్లు పోటీపడబోతున్నాయి. ఇదేమీ అచ్చుతప్పు కాదు, మీరు చదివింది నిజమే. ఒక మ్యాచ్‌లో మూడు జట్లు పోటీపడబోతున్నాయి. అది కూడా 36 ఓవర్లలో ఆటలో. కరోనా వైరస్‌ మహమ్మారితో నిస్తేజంగా మారిన క్రికెట్‌ను దక్షిణాఫ్రికా విప్లవాత్మక ఆలోచనతో పున ప్రారంభించబోతుంది. దక్షిణాఫ్రికా క్రికెటర్లతో కూడిన మూడు జట్లు ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. ఏబీ డివిలియర్స్‌, కగిసో రబాడ, క్వింటన్‌ డికాక్‌లు మూడు జట్లకు సారథ్యం వహించనున్నారు.

ఆ మూడు జట్లు ఏవంటే.... 

దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెటర్లు ఈ మూడు జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. నిధుల సమీకరణ కోసం ఈ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌ ద్వారా సమీకరించిన నిధులతో కరోనా వైరస్‌ మహమ్మారితో క్రికెట్‌ సర్క్యూట్‌లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయనున్నారు. ఈగల్స్‌ జట్టుకు ఏబీ డివిలియర్స్‌, కైట్స్‌ జట్టుకు క్వింటన్‌ డికాక్‌, కింగ్‌ఫిషర్స్‌ జట్టుకు కగిసో రబాడ నాయకత్వం వహించనున్నారు. ప్రతి జట్టులో 8 మంది క్రికెటర్లు ఉంటారు.

ఈగల్స్‌ : ఏబీ డివిలియర్స్‌ (కెప్టెన్‌), ఎడైన్‌ మార్కరమ్‌, లుంగి ఎంగిడి, ఫెలుక్‌వయో, వాన్‌డర్‌ డుసెన్‌, జూనియర్‌ డాలా, కైల్‌, సిసండ మగాల.

కైట్స్‌ : క్వింటన్‌ డికాక్‌ (కెప్టెన్‌), డెవిడ్‌ మిల్లర్‌, తెంబ బవుమా, ఎన్రిచ్‌ నోర్జ్టె, డ్వేన్‌ ప్రిటోరిస్‌, హెండ్రిక్స్‌, స్మట్స్‌, సిపామ్ల.

కింగ్‌ఫిషర్స్‌ : కగిసో రబాడ (కెప్టెన్‌), డుప్లెసిస్‌, క్రిస్‌ మోరిస్‌, షంషి, రీజా హెండ్రిక్స్‌, జనామెన్‌ మలన్‌, హెన్రిక్‌ క్లాసెన్‌, గ్లెంటన్‌ స్టర్‌మన్‌.

రూల్స్..... 

మూడు జట్ల క్రికెట్‌ మ్యాచ్‌ (3టీసీఎం) నిబంధనలను దక్షిణాఫ్రికా క్రికెట్‌ విడుదల చేసింది. 36 ఓవర్లు, మూడు జట్లు, రెండు భాగాలు, ఓ మ్యాచ్‌ రూల్స్‌ను విడుదల చేసింది. 3టీసీఎం రూల్స్‌ను ఇప్పుడు చూద్దాం. 

* 3టీసీఎం పాల్గొనే మూడు జట్లలో ఒక్కో జట్టుకు 8 మంది క్రికెటర్లు ప్రాతినిథ్యం వహిస్తారు. మ్యాచ్‌ నిడివి 36 ఓవర్లు. 18 ఓవర్లుగా రెండు భాగాల్లో నిర్వహిస్తారు. రెండు భాగాల నడుమ విరామ సమయం ఉంటుంది. 

* మ్యాచ్‌లో ప్రతి జట్టు 12 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తుంది. ఆట తొలి భాగంలో మూడేసి జట్లు 6 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తాయి. రెండో భాగంలో సైతం మూడు జట్లు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తాయి. తొలి 6 ఓవర్లకు ఓ ప్రత్యర్థి బౌలింగ్‌ చేయగా.. మలి 6 ఓవర్లకు మరో ప్రత్యర్థి బౌలింగ్‌ చేయనుంది. 

* తొలి అర్థ భాగంలో డ్రా ప్రకారం బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉంటుంది. తొలి ఆరు ఓవర్లలో అధిక పరుగులు చేసిన జట్టు రెండో భాగంలో తొలుత బ్యాటింగ్‌కు దిగుతుంది. స్కోర్లు సమంగా ఉంటే తొలి భాగం బ్యాటింగ్‌ ఆర్డర్‌ పునరావృతం చేస్తారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఉండదు. 

* 8 మందితో కూడిన జట్టులో 7 వికెట్లు పడిపోయినా.. ఎనిమిదో ఆటగాడు బ్యాటింగ్‌ కొనసాగించవచ్చు. కానీ 1, 3, 5 పరుగులను అనుమతించరు. 2, 4, 6 పరుగులకే అవకాశం. తొలి భాగంలోనే 7 వికెట్లు పడినా, రెండో భాగంలో ఎనిమిదో బ్యాట్స్‌మన్‌ బ్యాటింగ్‌ కొనసాగించవచ్చు. 

ప్రతి బౌలింగ్‌ జట్టుకు ఓ కొత్త బంతిని ఇస్తారు. ఆరేసి ఓవర్ల పాటు మిగతా రెండు జట్లకు బౌలింగ్‌ చేయాలి. ప్రతి బౌలర్‌కు గరిష్టంగా మూడు ఓవర్లు కేటాయిస్తారు. ఏడో వికెట్‌తో పడితే ఆ ఓవర్‌లో మిగిలిన బంతులను డాట్‌ బాల్స్‌గా పరిగణిస్తారు. నాన్‌స్ట్రయికర్‌ తర్వాతి ఓవర్‌లోనే బ్యాటింగ్‌కు రాగలడు. 

12 ఓవర్ల ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టు గోల్డ్‌ మెడల్‌, తర్వాతి జట్టు సిల్వర్‌, బ్రౌంజ్‌ మెడల్స్‌ గెల్చుకుంటాయి. పసిడి పతకం రేసులో రెండు జట్లు సమంగా నిలిస్తే సూపర్‌ ఓవర్‌ నిర్వహిస్తారు. రజతానికి సమవుజ్జీలుగా నిలిస్తే సిల్వర్‌ మెడల్‌ను పంచుకోవాలి, సూపర్‌ ఓవర్‌ ఉండదు. మూడు జట్లు సమానంగా పరుగులు సాధిస్తే మూడు జట్లకు గోల్డ్‌ మెడల్స్‌ అందిస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios