కరోనా వైరస్ నేపథ్యంలో కోల్‌కతా నగరం లాక్‌డౌన్ అయిన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. కరోనా కట్టడి చేసేందుకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. మనుషులు బయటకు రాని కోల్‌కతా నగరాన్ని జీవితకాలంలో చూస్తానని అనుకోలేదని గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు.

కోవిడ్-19ను కట్టడి చేసేందుకు దేశమంతా లాక్‌డౌన్ చేసిన సంగతి తెలిసిందే. పరిస్ధితి త్వరలోనే మెరుగవుతుందని, మీ అందరిపై తన ప్రేమ కొనసాగుతుందని  గంగూలీ ట్వీట్ చేశారు. నిర్మానుష్యంగా కనిపిస్తున్న కోల్‌కతా వీధుల చిత్రాలను పోస్ట్ చేశారు.

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 16 వేల మంది మరణించారు. భారత్‌లోనూ వైరస్ సోకిన వారి సంఖ్య 500 పైగా చేరుకోగా, 9 మంది మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ నిబంధన విధించిన సంగతి తెలిసిందే.

Also Read:వినకపోతే 24 గంటల కర్ఫ్యూ, అదీ కాకపోతే కనిపిస్తే కాల్చివేత: కేసీఆర్

కానీ ఇవేవీ పట్టని  కొందరు ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనను కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

దీంతో అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వ హెచ్చరికలను పెడచెవిన పెట్టి అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. ఈ విధంగా ఆంక్షల్ని ఉల్లంఘించిన 255 మందిని కోల్‌కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:సర్వైవ్ లెన్స్ స్టేట్ గా తెలంగాణ: తాజాగా మరో మూడు కరోనా కేసులు

ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం నిబంధనలు పాటించని వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు  తెలిపారు. కాగా పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటి వరకు ఏడు కరోనా కేసులు నమోదవ్వగా, ఒకరు మరణించారు.

ఈ క్రమంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ కారణంగా అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేయగా, వాణిజ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలను మూసివేశారు.