ఐపీఎల్-2019లో వివాదాలు మొదలయ్యాయి. రాజస్ధాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో బట్లర్ ఔటవ్వడం కొత్త వివాదాన్ని రేపింది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతికి బట్లర్‌ను స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేయడం అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.

దీంతో నెటిజన్లు అశ్విన్‌తో పాటు అతని భార్యాపిల్లలను టార్గెట్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ఈ సంఘటనపై ట్వీట్ చేస్తూ.. ‘‘ అశ్విన్ నువ్వు ఇలా ఆడుతావని అస్సలు ఊహించలేదు.. ఎందుకీ తొండాట, నీ ఆటతీరుతో సిగ్గుపడుతున్నాం’’ అన్నాడు.

నెటిజన్ల తీరు పట్ల అశ్విన్ భార్య ప్రీతి ఘాటుగా బదులిచ్చారు. ఐపీఎల్‌కు సంబంధించి ఎన్నో నియమాలు ఉన్నాయని అలాగే మైదానం మొత్తం కెమెరాల నిఘా ఉందని తెలిపింది. ట్వీట్టర్ కంటే కూడా ఇన్‌స్టాగ్రామ్ బెటరని అభిప్రాయపడింది. 

ఏం జరిగిందంటే: అశ్విన్ బంతి వేయబోయే సమయానికే బట్లర్ క్రీజును వదిలి కాస్త ముందుకు వచ్చాడు. దీంతో వెంటనే చేతిని వెనక్కి తీసుకున్న అశ్విన్ బెయిల్స్‌ను పడగొట్టి అప్పీల్ చేశాడు.

థర్డ్ అంపైర్ కూడా దానిని ఔట్‌గానే ప్రకటించడంతో బట్లర్ వెనుదిరగాల్సి వచ్చింది. రూల్ నెంబర్ 41.16  ప్రకారమైతే థర్డ్ అంపైర్ చేసింది సరైనదే కానీ.. జెంటిల్‌మన్‌గా ముద్రపడ్డ అశ్విన్ ఇలా చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.

బంతిని వేసేందుకు ముందుకు వచ్చిన అశ్విన్ భుజాల వరకు చేతిని తెచ్చి అరక్షణం ఆగినట్లు రీప్లైలో కనిపించింది. బట్లర్ క్రీజు దాటేవరకు కావాలనే అతను వేచి చూసినట్లు తెలుస్తోంది.

ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంలో కొందరు అశ్విన్‌ తెలివి తేటలను ప్రశంసిస్తుండగా.. మాజీలతో పాటు క్రికెట్ అభిమానులు మాత్రం ఇది సరైన పద్ధతి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.