Asianet News TeluguAsianet News Telugu

IND vs PAK: అర్ష్‌దీప్‌పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. ఖలిస్తాని అంటూ పోస్టులు.. మద్దతుగా నిలస్తున్న భజ్జీ

Asia Cup 2022: ఆసియా కప్-2022లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ఆదివారం ముగిసిన సూపర్-4 పోరులో టీమిండియా పోరాడి ఓడింది. అయితే అర్ష్‌దీప్ వల్లే మ్యాచ్ ఓడిపోయామంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Netizens Trolls Arshdeep Singh, Labels Him Khalisthani For Dropping Catch Against Pakistan
Author
First Published Sep 5, 2022, 9:35 AM IST

భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం దుబాయ్ వేదికగా ముగిసిన సూపర్-4 పోరులో టీమిండియా పోరాడి ఓడింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో భారీ స్కోరు చేసినా తర్వాత లక్ష్యాన్ని భారత బౌలర్లు కాపాడుకోలేకపోయారు. టీమిండియా బౌలర్ల వైఫల్యం కంటే అభిమానులు ఈ ఓటమికి అర్ష్‌దీప్ సింగ్ నే ప్రధాన దోషిగా చేస్తున్నారు.  అర్ష్‌దీప్ వల్లే మ్యాచ్ ఓడిపోయామని, అతడు ఖలిస్తాని అంటూ తీవ్రంగా  ట్రోల్ చేస్తున్నారు. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో మహ్మద్ షమీ వల్లే ఓడిపోయామంటూ  సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు అర్ష్‌దీప్ కూడా అదే ఆగ్రహాన్ని చవిచూస్తున్నాడు. 

ఈ మ్యాచ్ లో పాకిస్తాన్  బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో   17వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా.. మహ్మద్ రిజ్వాన్ ను ఔట్ చేశాడు. అప్పుడే క్రీజులోకి వచ్చిన అసిఫ్ అలీ.. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్లో  మూడో బంతికి భారీ షాట్ కు యత్నించాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ కు తాకి అక్కడే గాల్లోకి లేచింది.  

అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్.. సింపుల్ క్యాచ్ ను జారవిడిచాడు.  ఇదే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. అప్పటికే రిజ్వాన్ వికెట్ కోల్పోవడంతో కొంత ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్.. అసిఫ్ అలీ కూడా ఔటై ఉంటే ఫలితం మరో విధంగా ఉండేదేమో.. కానీ అర్ష్‌దీప్ క్యాచ్ మిస్ చేయడం వల్ల అసిఫ్ అలీ రెచ్చిపోయాడు.  తనకు దొరికిన లైఫ్ తో అతడు మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు.  భువనేశ్వర్ వేసిన 19వ ఓవర్లో ఓ సిక్సర్ తో పాటు రెండు ఫోర్లు కూడా బాది పాకిస్తాన్ ను విజయతీరాలకు చేర్చాడు.  

 

అసిఫ్ అలీ క్యాచ్ ను మిస్ చేయడమే భారత్ ఓటమికి కారణమని సోషల్ మీడియా వేదికగా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అంతేగాక వికిపీడియాలో అర్ష్‌దీప్ పేజీలో కూడా అతడిని ఖలిస్తానిగా చిత్రీకరించడం గమనార్హం. అర్ష్‌దీప్ ను  ఓ టీవీ ఛానెల్ యాంకర్ ఏకంగా ఖలిస్తాని అని పేర్కొనడం దుమారానికి దారి తీసింది. అయితే దీని వెనుక పాకిస్తాన్ కుట్ర ఉందని భారత అభిమానులు ఆరోపిస్తున్నారు.   

 

 

అర్ష్‌దీప్ పై ట్రోల్స్ వెల్లువెత్తుతుండటంతో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తో  పాటు  విరాట్ కోహ్లీ అతడికి మద్దతుగా నిలిచారు. అర్ష్‌దీప్ పై వస్తున్న ట్రోల్స్ పై  భజ్జీ తన ట్విటర్ ఖాతాలో స్పందిస్తూ.. ‘అర్ష్‌దీప్ ను ట్రోల్ చేయడం ఆపండి. కావాలని ఎవరూ క్యాచ్ లను మిస్ చేయరు. మన ఆటగాళ్లను చూసి గర్వపడాలి. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ మనకంటే కాస్త మెరుగ్గా ఆడింది. అర్ష్‌దీప్ పై ట్రోల్స్ చేస్తున్నవారిని చూస్తే సిగ్గుగా ఉంది. అతడు బంగారం..’ అని ట్వీట్ చేశాడు.  నిన్నటి మ్యాచ్ ముగిశాక కోహ్లీ స్పందిస్తూ.. ఇంత హై ప్రెషర్ గేమ్ లో చిన్న చిన్న తప్పులు జరగడం సహజమని అన్నాడు.  

Follow Us:
Download App:
  • android
  • ios