సఫారీలకు కోలుకోలేని షాకిచ్చిన నెదర్లాండ్స్.. టోర్నీ నుంచి ఔట్..! సెమీస్‌కు భారత్
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో సంచలనం. సెమీస్ రేసులో ముందువరుసలో ఉన్న సౌతాఫ్రికాకు నెదర్లాండ్స్ కోలుకోలని షాకిచ్చింది. సఫారీలతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్ 13 పరుగుల తేడాతో గెలిచింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా సెమీస్ రేసు నుంచి తప్పుకున్నట్టే..!
పొట్టి ప్రపంచకప్ సెమీస్ దశకు చేరుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామం. సౌతాఫ్రికా కలలను కల్లలు చేస్తూ నెదర్లాండ్స్ ఆ జట్టుకు కోలుకోలేని షాకిచ్చింది. అడిలైడ్ వేదికగా ముగిసిన గ్రూప్-2 చివరి లీగ్ మ్యాచ్ లో నెదర్లాండ్స్.. సౌతాఫ్రికాను 13 పరుగుల తేడాతో ఓడించింది. ఈ ఓటమి ప్రభావం సౌతాఫ్రికాపై దారుణంగా పడింది. నేడు ఇదే వేదికపై జరుగబోయే బంగ్లాదేశ్-పాకిస్తాన్ మ్యాచ్ లో ఫలితం తేలకుంటేనే సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకుంటుంది. అలా కాకుండా ఆ మ్యాచ్ లో ఫలితం తేలితే.. గెలిచిన జట్టు సెమీస్ కు వెళ్తుంది. ఓడిన జట్టుతో పాటు సఫారీలు కూడా బ్యాగ్ సర్దుకోవాల్సిందే. సౌతాఫ్రికా ఓటమితో భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించింది. నేడు సాయంత్రం జింబాబ్వేతో జరుగబోయే ఫలితంతో సంబంధం లేకుండా భారత జట్టు సెమీస్ కు దూసుకెళ్లింది.
అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన నెదర్లాండ్స్-దక్షిణాఫ్రికా మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన డచ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్ మైబర్గ్ (37), టాప్ కూపర్ (35), అకెర్మన్ (41) లు రాణించారు.
అనంతరం దక్షిణాఫ్రికా.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నానా తంటాలు పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (13) తో పాటు టెంబ బవుమా (20), రిలీ రొసోవ్ (25), మార్క్రమ్ (17), డేవిడ్ మిల్లర్ (17), హెన్రిచ్ క్లాసెన్ (21), వేన్ పార్నెల్ (0), కేశవ్ మహారాజ్ (13) లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా.. 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 145 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్యానికి 13 పరుగుల దూరంలో నిలిచింది.
డచ్ బౌలర్లు సమిష్టిగా రాణించి సఫారీలను కట్టడి చేశారు. ఆ జట్టులో బ్రాండన్ గ్లోవర్ మూడు వికెట్లను తీయగా.. బస్ డీ లీడ్ 2, ఫ్రెడ్ క్లాసెన్ 2 వికెట్లతో చెలరేగారు.
సఫారీలు ఓడటంతో సెమీస్ మీద ఆశలే లేని పాకిస్తాన్ - బంగ్లాదేశ్ లు ఇప్పుడు హోరాహోరి పోరుకు సిద్ధమవనున్నాయి. వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతే తప్ప ఈ మ్యాచ్ లో గెలిచినోళ్లు భారత్ తర్వాత సెమీస్ చేరే రెండో జట్టుగా ఉంటారు. దీంతో పాక్, బంగ్లా మధ్య రసవత్తర పోరు జరగడం ఖాయం.